Cricket: నెదర్లాండ్స్‌పై ఆసీస్ విజయంతో పాకిస్థాన్‌పై మరింత ఒత్తిడి.. పాయింట్ల పట్టికలో ఇదీ పరిస్థితి!

Pressure On Pakistan Multiplies As Australia Consolidate Top Four Position
  • పాయింట్ల పట్టికలో 4వ స్థానాన్ని పటిష్ఠం చేసుకున్న ఆస్ట్రేలియా
  • పాయింట్లతోపాటు నెట్ రన్‌రేట్ విషయంలోనూ పాక్ వెనుకంజ
  • మరింత సంక్లిష్టంగా మారిన పాక్ సెమీస్ అవకాశాలు
వరల్డ్ కప్‌ 2023లో పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్న పాకిస్థాన్‌పై మ్యాచ్‌లు గడుస్తున్న కొద్ది ఒత్తిడి మరింతగా పెరుగుతోంది. 5 మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలోనే విజయం సాధించడమే ఈ పరిస్థితికి కారణమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమవుతూ సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. తాజాగా నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా సాధించిన భారీ విజయంతో పాక్‌ జట్టు ఇబ్బందిపడడం ఖాయంగా కనిపిస్తోంది.

బుధవారం రాత్రి నెదర్లాండ్స్‌పై విజయంతో ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానాన్ని ఆస్ట్రేలియా మరింత పటిష్ఠం చేసుకుంది. మొదటి మూడు స్థానాల్లో భారత్(10 పాయింట్లు), దక్షిణాఫ్రికా (8 పాయింట్లు), న్యూజిలాండ్ (8 పాయింట్లు) వరుస స్థానాల్లో ఉన్నాయి. తాజా గెలుపుతో ఆస్ట్రేలియా కూడా నాలుగో స్థానాన్ని పదిలం చేసుకునేలా కనిపిస్తోంది. దీంతో సెమీస్‌పై ఆశలు పెట్టుకున్న పాకిస్థాన్‌కు ఆసీస్ తాజా గెలుపు ఆశల మీద నీళ్లు చల్లేలా ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఐదో స్థానంలో ఉన్న పాకిస్థాన్ 5 మ్యాచ్‌లు ఆడి కేవలం 4 పాయింట్లతో ఉంది. పాయింట్ల విషయంలోనే కాకుండా -0.400 రన్‌రేట్‌తో చాలా వెనుకబడి ఉంది. ఈ పరిణామాల మధ్య పాకిస్థాన్ తదుపరి మ్యాచుల్లో ఏ విధంగా రాణిస్తుందో వేచిచూడాలి.

కాగా.. క్రికెట్ ప్రపంచ కప్‌లో భాగంగా బుధవారం నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా ఏకంగా 309 పరుగుల భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన మ్యాచుల్లో ఇది రెండవది కావడం గమనార్హం. డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్‌ సెంచరీలు ఈ భారీ విజయానికి కారణమయ్యాయి. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఏకంగా 40 బంతుల్లోనే సెంచరీ కొట్టి వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసి శెభాస్ అనిపించుకున్నాడు.
Cricket
Pakistan
Australia

More Telugu News