Revanth Reddy: రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు... డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ బహిష్కృత నేత

Suspended Congress leader allegations on Revanth Reddy
  • రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందన్న కురువ విజయ్ కుమార్
  • డీజీపీ సానుకూలంగా స్పందించారన్న నేత
  • కాంగ్రెస్ కోసం అహర్నిశలు పని చేస్తే వేరేవాళ్లకు గద్వాల టిక్కెట్ ఇచ్చారని ఆగ్రహం
  • రేవంత్ రెడ్డి టిక్కెట్లను అమ్ముకున్నారని ఆరోపణలు
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన కురువ విజ‌య్ కుమార్ డీజీపీకి బుధవారం ఫిర్యాదు చేశారు. టీపీసీసీ ప్ర‌చార క‌మిటీ స‌భ్యుడిగా పనిచేసిన విజ‌య్ కుమార్ ఈ రోజు డీజీపీ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... త‌మ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారన్నారు. ఈ అంశంపై త‌క్ష‌ణ‌మే విచార‌ణ జరిపిస్తామని హామీ ఇచ్చారన్నారు. కాంగ్రెస్ కోసం పదిహేనేళ్లుగా ప‌ని చేసిన త‌న‌ను కాద‌ని, నిన్న‌మొన్న పార్టీలో చేరిన వ్య‌క్తికి గ‌ద్వాల టికెట్ ఇచ్చార‌ని ఆవేదన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లను డ‌బ్బుల‌కు, భూముల‌కు అమ్ముకుంటున్నార‌ని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ల విష‌యంలో రేవంత్ రెడ్డి డ‌బ్బులు తీసుకోకపోతే భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యంలో ప్ర‌మాణం చేయాల‌ని స‌వాల్ విసిరారు. రేవంత్ రెడ్డి అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఈడీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ కారణంగానే రేవంత్ అనుచరులు త‌మ‌ను వేధిస్తున్నార‌న్నారు.

తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా ప‌ని చేశామని, పదిహేనేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం ప‌ని చేస్తున్నామన్నారు. అలాంటి తనను ఇవాళ అకార‌ణంగా పార్టీ నుంచి స‌స్పెండ్ చేశార‌న్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన త‌మ‌ను అణ‌గ‌దొక్కడానికి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నార‌ని విమర్శలు గుప్పించారు.
Revanth Reddy
Congress
Telangana Assembly Election

More Telugu News