KCR Nomination: గజ్వేల్, కామారెడ్డిలలో కేసీఆర్ పోటీ.. నామినేషన్ ఎప్పుడంటే..!

  • నవంబర్ 9న రెండుచోట్లా ఒకేసారి నామినేషన్
  • తొలుత గజ్వేల్ లో.. తర్వాత కామారెడ్డిలో ఫైల్ చేయనున్న బీఆర్ఎస్ బాస్
  • కామారెడ్డిలో కేసీఆర్ పై 120 మంది రైతుల పోటీ?
CM KCR Going To File Nomination On November 9

తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ వచ్చే నెల 9న నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. వచ్చే నెల 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయనున్నారు. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలోనూ ఆయన బరిలో ఉండనున్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ పూజలు చేయనున్నారు. ఆపై గజ్వేల్ కు చేరుకుని నామినేషన్ దాఖలు చేస్తారు. అక్కడి నుంచి కామారెడ్డికి వెళ్లి మధ్యాహ్నం 2 గంటలకు రెండో నామినేషన్ ఫైల్ చేయనున్నారు. 

నామినేషన్ దాఖలు చేసిన తర్వాత సాయంత్రం కామారెడ్డిలో పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. ఈసారి కామారెడ్డిలో పోటీ చేయాలని నిర్ణయించిన గులాబీ బాస్.. నియోజకవర్గం అభివృద్ధి చెందడం కోసమే తాను పోటీ చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు, మాస్టర్ ప్లాన్ కారణంగా భూములు కోల్పోతున్న రైతులు చాలారోజులుగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినాసరే ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎన్నికల బరిలోకి దిగాలని రైతు ప్రతినిధులు నిర్ణయించారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ బాస్ పై ఏకంగా 120 మంది పోటీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. మాస్టర్ ప్లాన్ వివాదాన్ని పూర్తిస్థాయిలో పరిష్కరించాలనే డిమాండ్ తోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైతుల ప్రతినిధులు తెలిపారు.

More Telugu News