Hyderabad: హైదరాబాదులో మరోసారి ఫార్ములా-ఈ రేసింగ్

  • ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాదులో ఫార్ములా-ఈ రేసింగ్ నిర్వహణ
  • వచ్చే ఏడాది మరోసారి రేసింగ్ ఆతిథ్యమివ్వనున్న హైదరాబాద్
  • ప్రపంచవ్యాప్తంగా 16 రేసులు... హైదరాబాదులో నాలుగో రేసు
Hyderabad once again will host Formula E racing

ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాదులోని హుస్సేన్ సాగర్ తీరంలో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసింగ్ క్రీడాభిమానులను విశేషంగా అలరించింది. నిర్వహణాపరమైన కొన్ని లోపాలు ఉన్నప్పటికీ, మొత్తమ్మీద రేసింగ్ పోటీలు ఫర్వాలేదనిపించాయి. దేశంలో మొదటిసారి నిర్వహించిన ఈ ఫార్ములా-ఈ రేసింగ్ ఈవెంట్ లో ఫ్రెంచ్ రేసర్ జీన్ ఎరిక్ వెర్నే విజేతగా నిలిచాడు. 

కాగా, హైదరాబాద్ నగరం మరోసారి ఫార్ములా-ఈ చాంపియన్ షిప్ కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకుంది. ఫార్ములా-ఈ చాంపియన్ షిప్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 16 రేసింగ్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. ఇందులో తొలి రేసు 2024 జనవరి 13న జరగనుండగా, మెక్సికో ఆతిథ్యమిస్తోంది. నాలుగో రేసు హైదరాబాదు నగరంలో జరగనుంది. ఫిబ్రవరి 10న ఈ రేసు నిర్వహించనున్నారు.

హుస్సేన్ సాగర్ రేసింగ్ సర్క్యూట్ లో ఫార్ములా-ఈ రేసింగ్ కు ముందు నవంబరు 4, 5 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు జరపనున్నారు. ఇదే ట్రాక్ పై ఎఫ్4 పోటీలు కూడా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News