Boora Narsaiah Goud: మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బూర నర్సయ్య గౌడ్ పోటీ?

  • కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారని జోరుగా ప్రచారం
  • మునుగోడు బరిలో బూర నర్సయ్య పేరును పరిశీలిస్తున్న బీజేపీ పెద్దలు
  • మునుగోడులో బీసీలు అధికంగా ఉండటంతో కలిసి వస్తుందని బీజేపీ నేతల లెక్కలు
Boora Narsaiah Goud may contest on Rajagopal Reddy

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయన తిరిగి అదే గూటికి చేరుతారనే చర్చ మీడియాలో నడుస్తోంది. బీజేపీ విడుదల చేసిన మొదటి జాబితాలో మునుగోడు నుంచి అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి పేరే ఉంటుందని అందరూ భావించారు. కానీ మునుగోడు అభ్యర్థిని బీజేపీ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నందునే బీజేపీ ప్రకటించలేదని భావిస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే మునుగోడు నుంచి బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన బూర నర్సయ్య గౌడ్‌ను రాజగోపాల్ రెడ్డిపై పోటీ చేయించాలని యోచిస్తోందట. టిక్కెట్ల కేటాయింపుకు సంబంధించి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఎందుకంటే, ఇక్కడ బీసీలు అధికంగా ఉన్నారు. ముఖ్యంగా గౌడ ఓటర్లు 35వేలకు పైగా అంటే దాదాపు 16 శాతం వరకు ఉన్నారు. ముదిరాజ్, పద్మశాలి, యాదవ, ఎరుకల, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ ఓటర్లు కూడా భారీగానే ఉన్నారు. దీంతో మునుగోడు నుంచి బూర నర్సయ్యకు అవకాశం ఇస్తే కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.

2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి స్థానం నుంచి పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించారు. అయితే ఆయన మాత్రం మునుగోడు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరట. పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడంపై ఆయన ఆసక్తితో ఉన్నారని, ఒకవేళ అసెంబ్లీకి పోటీ చేసినా ఇబ్రహీంపట్నం ఆయన తొలి ప్రాధాన్యతగా వుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు నుంచి పోటీ చేయాలని ఆదేశిస్తే కనుక బూర నర్సయ్య బరిలోకి దిగవచ్చునని చెబుతున్నారు.

More Telugu News