Study permit: భారతీయ విద్యార్థికి స్టడీ పర్మిట్ నిరాకరణ.. ఊరటనిచ్చిన కెనడా కోర్టు

  • కెనడా కోర్టులో భారతీయ విద్యార్థికి భారీ ఊరట
  • తక్కువ మార్కులు, లక్ష్యాల్లో అస్పష్టత కారణంగా స్టడీ పర్మిట్ నిరాకరణను తప్పు పట్టిన కోర్టు
  • చదువుల్లో విజయావకాశాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని వ్యాఖ్య
  • విద్యార్థి దరఖాస్తుపై న్యాయసమీక్షకు ఫెడరల్ కోర్టు ఆఫ్ కెనడా ఆదేశం
Canada court orders judicial review of study permit application of Indian student low academic track record

మార్కులు తక్కువ రావడంతో స్టడీ పర్మిట్ కోల్పోయిన భారతీయ విద్యార్థి కేసులో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ కెనడా తాజాగా కీలక తీర్పు వెలువరించింది. విద్యార్థికి ఊరటనిస్తూ అతడి అప్లికేషన్‌పై న్యాయసమీక్ష జరగాలని ఆదేశించింది. పర్మిట్ తిరస్కరించేందుకు కెనడా అధికారి పేర్కొన్న కారణాలు సమర్థనీయం కాదని అభిప్రాయపడింది. పూర్తి వివరాల్లోకి వెళితే, ఓ భారతీయ విద్యార్థికి టొరొంటోలోని ఓ కాలేజీలో సీటు దొరికింది. బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో అతడికి సీటు కేటాయిస్తూ యాజమాన్యం లెటర్ ఆఫ్ ఎక్సెప్టెన్స్ జారీ చేసింది. 

అయితే, కెనడా అధికారి మాత్రం అతడికి స్టడీ పర్మిట్ నిరాకరించారు. గతంలో అతడి అకడమిక్ రికార్డు సరిగా లేదని, విద్యాపరమైన లక్ష్యాల్లో స్పష్టత లేదని పేర్కొన్నారు. కాగా, న్యాయస్థానం కెనడా అధికారి నిర్ణయాన్ని తప్పుపట్టింది. గతంలో వచ్చిన మార్కులకు, తాజా కోర్సులో అతడి విజయావకాశాలకు మధ్య సంబంధాన్ని స్పష్టంగా రుజువు చేయలేకపోయాడని వ్యాఖ్యానించింది. ఒక సబ్జెక్టులో తక్కువ ప్రతిభ కనబరిచిన వారు మరో సబ్జెక్టుకు కూడా పనికిరారని భావించరాదని పేర్కొంది. 

ఇలాంటి మరో కేసులో తీర్పునూ న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రస్తావించింది. చదువుల్లో విజయావకాశాలు ఎప్పటికప్పుడు మారుతుంటాయని, అవి అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది. సీటు కేటాయింపుతో విద్యార్థి కోర్సుకు అర్హుడన్న విషయాన్ని టొరొంటో కాలేజీ పరోక్షంగా పేర్కొన్నట్టు న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో, ఈ తీర్పు విదేశీ విద్యార్థులకు కీలకమన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

More Telugu News