Nepal Earthquake: నేపాల్‌ను భయపెడుతున్న వరుస భూకంపాలు.. మళ్లీ మరోటి!

  • ఆదివారం 6.1 తీవ్రతతో భూకంపం
  • తాజాగా ఈ తెల్లవారుజామున 4.1 తీవ్రతతో మరోటి
  • ఖాట్మండుకు 393 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
  •  అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో 11వ స్థానంలో నేపాల్ 
Another earthquake hits Nepal this morning

పొరుగుదేశం నేపాల్‌ను భూకంపాలు భయపెడుతున్నాయి. రెండు రోజుల క్రితం ఆ దేశ రాజధాని ఖాట్మండులో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదృష్టవశాత్తు ఆస్తి, ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ఈ తెల్లవారుజామున 4.17 గంటలకు 4.1 తీవ్రతతో భూమి కంపించింది. వరుస భూకంపాలతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి వీధుల్లోనే గడుపుతున్నారు. ఖాట్మండుకు ఉత్తర, ఈశాన్యం దిశగా 393 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. తాజా భూకంపంలోనూ ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు ఇప్పటి వరకు అందలేదు.  

టిబెటన్, ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే నేపాల్‌లో భూకంపాలు సర్వసాధారణంగా మారాయి. శతాబ్దానికి ఒకసారి ఈ రెండు ప్లేట్లు ఒకదానికొకటి రెండుమీటర్ల మేర దగ్గరకు జరుగుతుండడంతో ఒత్తిడి ఏర్పడి భూకంపాలు సంభవిస్తున్నాయి. 2015లో ఇక్కడ 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం పెను ప్రళయాన్నే సృష్టించింది. ఆ భూకంపంలో దాదాపు 9 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు మిలియన్ నిర్మాణాలు కుప్పకూలాయి. అత్యధిక భూకంపాలు సంభవించే దేశాల్లో ప్రపంచంలో నేపాల్‌ది 11వ స్థానం.

More Telugu News