Nara Lokesh: ఇవాళ్టి టీడీపీ-జనసేన కమిటీ సమావేశంలో మూడు తీర్మానాలు చేశాం: నారా లోకేశ్

Nara Lokesh speech after TDP and Janasena coordination committee meeting
  • ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు
  • నేడు రాజమండ్రిలో ఇరు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం
  • ఈ సమావేశం చారిత్రాత్మకమన్న లోకేశ్
  • అరాచక పాలన నుంచి ప్రజలను కాపాడేందుకు పొత్తు అని స్పష్టీకరణ
  • నేటి సమావేశంలో ప్రజల గురించే చర్చించామని వెల్లడి
టీడీపీ-జనసేన పొత్తు కుదిరాక ఏర్పాటైన ఇరు పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ తొలిసారిగా ఇవాళ రాజమండ్రిలో సమావేశమైంది. ఈ సమావేశానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం లోకేశ్, పవన్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, ఇవాళ విజయదశమి సందర్భంగా రాజమండ్రిలో సమావేశమయ్యాయని, ఇది రాష్ట్రానికి మేలు చేసే కలయిక అని అభివర్ణించారు. 2014లో నవ్యాంధ్రకు రాజధాని లేదు... అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి సమర్థుడైన నేత అవసరం అని ఎలాంటి షరతలు లేకుండా పవన్ కల్యాణ్ గారు టీడీపీ, బీజేపీ పొత్తుకు మద్దతు ఇచ్చారు అని లోకేశ్ పేర్కొన్నారు. ఇవాళ మళ్లీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జనసేన కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. 

"నేటి సమావేశంలో ప్రజల గురించే ప్రధానంగా చర్చించాం. గత నాలుగున్నరేళ్లుగా ఏపీలో సామాజిక అన్యాయం జరుగుతోంది. ఎన్నడూ లేనంతగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయి. 

ఇక, రాష్ట్రంలో కరవు-జగన్ కవల పిల్లలు. ఇవాళ 34 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం చేతగానితనంతో సాగునీటి ప్రాజెక్టులన్నీ గాలికొదిలేసింది. మిగులు జలాలన్నీ సముద్రం పాల్జేశారు. ప్రాజెక్టుల నిర్వహణ పట్ల నిర్లక్ష్యం వహించారు, కనీసం కాలువల్లో నాచు తీసే పరిస్థితి లేదు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల ఆత్మహత్యల్లో మన రాష్ట్రం భారతదేశంలోనే 3వ స్థానంలో ఉంది. 

కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇంటి పన్ను, చెత్త పన్ను విపరీతంగా పెంచేసిన ఈ ప్రభుత్వం ప్రజలపై పెద్ద ఎత్తున భారం మోపింది. గత నాలుగున్నరేళ్లుగా ఏపీకి ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? ఎన్నికల ముందు 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న జగన్... మాట నిలబెట్టుకోలేదు.

ప్రజా సమస్యలపై పోరాడినవాళ్లపై కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏ తప్పు చేయని చంద్రబాబును అరెస్ట్ చేసి 44 రోజులుగా రిమాండ్ లో ఉంచారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కేయాలని చూస్తున్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో... పవన్ కల్యాణ్ గారు హైదరాబాద్ నుంచి మంగళగిరి రావాలనుకుంటే ఆయన ఎక్కిన ఫ్లైట్ టేకాఫ్ కూడా చేయనివ్వలేదు. పవన్ గారు వస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందట. ఆయన రోడ్డు మార్గంలో వస్తే దాదాపు మూడు గంటల పాటు బోర్డర్ లో ఆపేశారు. ఆయన ఎంతో తీవ్రంగా పోరాడితేనే రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అనుమతించారు. ఆయన వస్తే శాంతిభద్రతల సమస్య ఎక్కడా రాలేదు. 

ఈ ప్రభుత్వంపై ఎవరు పోరాడినా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల తరఫున పోరాడడానికే టీడీపీ-జనసేన ముందుకు వచ్చాయి. దాంట్లో భాగంగా నేడు జేఏసీ మొదటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. రాబోయే 100 రోజులకు సంబంధించిన కార్యాచరణపై చర్చించాం. ఈ నెల 29 నుంచి 31 వరకు మూడ్రోజుల పాటు ఉమ్మడి జిల్లాల స్థాయిలో టీడీపీ, జనసేన నేతలు సమావేశమై చర్చలు జరుపుతారు. 

నవంబరు 1 నుంచి మేనిఫెస్టో రూపొందించుకుని ఇరు పార్టీలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో కరవు పరిస్థితులపై టీడీపీ, జనసేన శ్రేణులు పరిశీలించి వాస్తవాలు ఏంటన్నది పార్టీలకు నివేదికలు ఇవ్వాలని నిర్ణయించాం. జేఏసీ తదుపరి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. 

నేటి సమావేశంలో మూడు తీర్మానాలు చేశాం. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని నిరసిస్తూ మొదటి తీర్మానం చేశాం. అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడడానికే ఈ పొత్తు ఏర్పాటు చేసుకున్నామని రెండో తీర్మానం చేశాం. అన్ని వర్గాలను అభివృద్ధి బాటలో నడిపేందుకే ఈ పొత్తు అని మూడో తీర్మానం చేశాం. పవన్ కల్యాణ్ గారు చెప్పినట్టు ఇవాళ్టి సమావేశం ఒక చారిత్రక కలయిక. 

నాకెలాంటి సందేహం లేదు... 2024లో ఏపీలో టీడీపీ-జనసేన బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ మంచి రోజులు తీసుకువచ్చే బాధ్యతను స్వీకరిస్తాం" అని నారా లోకేశ్ వివరించారు.
Nara Lokesh
TDP
Janasena
Pawan Kalyan
Coordination Committee
Rajahmundry
Andhra Pradesh

More Telugu News