Cricket: డిస్నీ హాట్‌స్టార్‌ రికార్డ్.. భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్‌కు ఒకేసారి 4.3 కోట్ల వీక్షణలు

Disney Hotstar Record with 4 crores 30 lakhs Vivership for India vs New Zealand match
  • భారత్ వర్సెస్ న్యూజిలాండ్‌ను భారీగా వీక్షించిన ఫ్యాన్స్
  • పాకిస్థాన్ మ్యాచ్‌ను అధిగమించిన వ్యూయర్ షిప్
  • దోహదపడ్డ దసరా సెలవులు, ఆదివారం
భారత్‌లో క్రికెట్‌కు ఎంతటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ద్వైపాక్షిక సిరీస్‌లకే టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అతుక్కుపోయే క్రికెట్ ఫ్యాన్స్.. వరల్డ్ కప్ లాంటి ఐసీసీ ఈవెంట్స్‌కు ఊరుకుంటారా...! రికార్డులు బద్దలయ్యేలా మ్యాచ్‌లు ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా భారత్ మ్యాచ్‌లను విపరీతంగా వీక్షిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

సాధారణంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌‌లకు విపరీతమైన ఆదరణ ఉంటుందని అందరికీ తెలిసిందే. కానీ ఆదివారం రాత్రి న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌ను క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో వీక్షించారని డిస్నీ హాట్‌స్టార్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఒకేసారి 3.2 కోట్ల మంది వీక్షించడం రికార్డుగా నిలవగా ఇప్పుడది చెరిగిపోయింది. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌ను ఒకేసారి ఏకంగా 4.3 కోట్ల మంది డిస్నీ హాట్‌స్టార్‌ వేదికపై వీక్షించారు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో వ్యూయర్స్ సంఖ్య 4 కోట్లు దాటింది. క్రమంగా ఈ సంఖ్య 4.3 కోట్లు అధిగమించిందని డిస్నీ హాట్‌స్టార్‌ ప్రకటించింది. దసరా సెలవులు, అందులోనూ ఆదివారం కావడంతో ఈ స్థాయి వ్యూయర్ షిప్ రావడానికి తోడ్పడ్డాయి.

కాగా.. క్రికెట్ ప్రసారాలకు సంబంధించి స్టార్ గ్రూప్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌ను జియో సినిమా యాప్‌లో ఉచితంగా ప్రసారం చేయడంతో సమీకరణాలన్నీ మారిపోయాయి. వ్యూయర్ షిప్ తగ్గిపోతున్న విషయాన్ని గుర్తించిన డిస్ని హాట్‌స్టార్ కూడా సబ్‌స్ర్కిప్షన్ లేకుండానే ఉచితంగా వరల్డ్ కప్ మ్యాచ్‌లను వీక్షించే అవకాశం కల్పిస్తున్న విషయం తెలిసిందే.
Cricket
Team India
Team New Zealand
BCCI

More Telugu News