భారత్‌లో 'ఫాగ్' నడుస్తోంది, ఇంగ్లండ్‌లో 'బర్నాల్' నడుస్తోంది!: సెహ్వాగ్ సెటైర్
- ధర్మశాల స్టేడియం అవుట్ ఫీల్డ్ ప్రమాదకరమన్న ఇంగ్లండ్
- అదే స్టేడియంలో వ్యూహాత్మకంగా ఫీల్డింగ్ చేసిన భారత్
- ఇంగ్లండ్ కు చురకలు అంటించిన సెహ్వాగ్
‘‘భారత్ లో 'ఫాగ్' నడుస్తోంది. ఇంగ్లండ్‌లో 'బర్నాల్' నడుస్తోంది. వీటన్నింటికంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల హవా ఎక్కువగా కొనసాగుతోంది’’ అంటూ ఎక్స్ వేదికగా సెహ్వాగ్ స్పందించాడు. ఆదివారం రాత్రి న్యూజిలాండ్‌పై భారత్ గెలుపు అనంతరం మాజీ దిగ్గజం ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. కాగా ఇక్కడ డైవింగ్ చేస్తే ఆటగాళ్లు గాయాల పాలయ్యే ప్రమాదముందని ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్, ఆఫ్ఘన్ కోచ్ ట్రాట్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే.
ప్రమాదకరం అని ఇంగ్లండ్ భావించిన ధర్మశాల స్టేడియం అవుట్ ఫీల్డ్ లో భారత్ ఎంతో జాగ్రత్తగా ఫీల్డింగ్ చేసిందన్న విషయాన్ని సెహ్వాగ్ పరోక్షంగా ప్రస్తావించాడు. అదే సమయంలో, ఈ స్టేడియంపై ఇంగ్లండ్ బాహాటంగా విమర్శలు గుప్పించడాన్ని, టీమిండియా ఎలాంటి విమర్శలకు పోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లడాన్ని కూడా సెహ్వాగ్ తన వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పాడు. ముఖ్యంగా, ధర్మశాలలో టీమిండియా సాధికారికంగా గెలవడం పట్ల ఇంగ్లండ్ కడుపు మంటతో రగిలిపోతుంటుందని వ్యంగ్యంగా చెప్పేందుకు బర్నాల్ (కాలిన గాయాలకు పూసే మందు) పేరును ఉపయోగించి ట్వీట్ చేశాడు.