Mohammed Shami: అందుకే కదా.. షమీకి జేజేలు పడుతున్నది!

Team India pacer Mohammed Shami once again proved his skills
  • కివీస్‌పై ఐదు వికెట్లతో విరుచుకుపడిన షమీ
  • జట్టులో చోటుకోల్పోయినా విశ్వాసం కోల్పోని పేసర్
  • స్వగ్రామంలో నిరంతర ప్రాక్టీస్‌తో నైపుణ్యాలకు మెరుగు
  • ప్రపంచకప్‌లో రెండుసార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన టీమిండియా తొలి బౌలర్‌గా రికార్డు
ఒంటిచేత్తో జట్టుకు పలు విజయాలు అందించిన టీమిండియా స్టార్ పేసర్ షమీ ఇటీవల కొంత వెనకబడ్డాడనే చెప్పాలి. ఫాం కోల్పోయి వికెట్ల వేటలో జోరు ప్రదర్శించలేక జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ చాలా మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. మూడేళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో విఫలం కావడంతో షమీకి జట్టులో చోటు ప్రశ్నార్థకమైంది. జట్టుకు దూరమైన షమీకి మళ్లీ 19 నెలల తర్వాత సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. బుమ్రా, ప్రసీద్ కృష్ణ వంటివారు గాయాలబారినపడడంతో సెలక్టర్లకు అతడే కనిపించాడు.

జట్టుకు దూరమైనా నిరంతర ప్రాక్టీస్
జట్టులో చోటు కరవైనా షమీలో మాత్రం విశ్వాసం సడలిపోలేదు. ఏదో ఒకరోజు జట్టుకు తన అవసరం ఉంటుందని, తప్పకుండా పిలుపు వస్తుందని భావించాడు. ఉత్తరప్రదేశ్‌ అమ్రోహా జిల్లాలోని సాహస్‌పూర్‌లో సొంత ఖర్చుతో పలు రకాల పిచ్‌లతో పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్‌లో మునిగి తేలేవాడు. నైపుణ్యాలకు పదునుపెట్టుకున్నాడు. గత రాత్రి కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లో బెబ్బులిలా గర్జించి ఆ జట్టు వెన్ను విరిచేందుకు ఆ ప్రాక్టీస్ ఎంతగానో తోడ్పడింది. ఐదు వికెట్లు తీసి ఓ అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్‌లో రెండుసార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు.

రన్నింగ్‌పైనే దృష్టి
షమీ గురించి అతడి చిన్ననాటి కోచ్, మార్గదర్శకుడు మహ్మద్ బద్రుద్దీన్ మాట్లాడుతూ.. షమీకి క్రికెట్ తప్ప మరో లోకం తెలియదని అన్నాడు. జట్టుకు దూరంగా ఉన్నా నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు నిరంతరం ప్రయత్నించేవాడని చెప్పాడు. ఈ ఏడాది విండీస్ పర్యటన నుంచి బ్రేక్ తీసుకున్నప్పుడే ప్రపంచకప్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడని వివరించాడు. షమీ ఎక్కువగా రన్నింగ్‌పైనే దృష్టి పెడతాడని, జట్టుకు దూరంగా ఉన్నప్పుడు తన పొలంలో రన్నింగ్ చేస్తూ ఉంటాడని చెప్పుకొచ్చాడు. 

షమీ సూపర్ పేసర్
తనలో చేవ ఏమాత్రం తగ్గలేదని భావించే షమీ జట్టులో చోటు కోల్పోయినా నిరుత్సాహపడలేదు. ఏదో ఒకరోజు జట్టుకు తన అవసరం ఉంటుందని భావించి నిరంతర సాధనలో మునిగిపోయేవాడు. ఇప్పుడదే అతడిని మరోమెట్టు ఎక్కించింది. షమీ మేటి పేసర్ అని మరోమారు నిరూపించాడు. జట్టులోకి వచ్చిన ప్రతిసారీ అత్యద్భుత ప్రదర్శనతో విజయాలు కట్టబెడుతున్న షమీ సూపర్ పేసర్ అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందుకే అతడికి అభిమానులు జేజేలు పలుకుతున్నారు.
Mohammed Shami
Team India
ODI World Cup 2023

More Telugu News