Shoaib Ali: రోహిత్‌శర్మ అంత గొప్ప ప్లేయర్ ఎందుకయ్యాడో చెప్పిన బంగ్లాదేశ్ సూపర్ ఫ్యాన్

  • కారు ఆపి కిందికి దిగొచ్చి బంగ్లా ఫ్యాన్ షోయబ్‌తో మాట్లాడిన రోహిత్‌శర్మ
  • భారత్-బంగ్లా మ్యాచ్ సందర్భంగా వేధింపులు ఎదుర్కొన్న షోయబ్
  • క్షమాపణలు చెప్పిన టీమిండియా అభిమానులు
Indian Fans apologise Bangladesh superfan Shoaib Ali

టీమిండియా సారథి రోహిత్‌శర్మ అంత గొప్ప ప్లేయర్ ఎందుకయ్యాడో బంగ్లాదేశ్ సూపర్ ఫ్యాన్ షోయబ్ అలీ చెప్పుకొచ్చాడు. 19న పూణెలో జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ముందు షోయబ్‌కు రోహిత్‌ను కలిసే అవకాశం లభించింది. ఇండియన్ కెప్టెన్‌ను చూడగానే తనను తాను నమ్మలేకపోయాడు. షోయబ్‌ను చూసిన రోహిత్ వెంటనే కారు ఆపి అతడి వద్దకు వెళ్లి ‘అరె తూ యహా ఆగయా’ (నువ్వు ఇక్కడికి వచ్చావా?) అని ప్రశ్నించడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.

‘‘బంగ్లాదేశ్ ఫ్యాన్స్‌తో కలిసి స్టేడియం బయట వెయిట్ చేస్తున్నా. సడన్‌గా ఓ బ్లూకారు దూసుకొచ్చింది. డ్రైవింగ్ సీట్‌లో రోహిత్ ఉన్నాడు. నేను వెంటనే రోహిత్ అని అరిచాను. ఆ వెంటనే రోహిత్ కారు ఆపి కిందికి దిగి నాతో మాట్లాడాడు. రోహిత్ అంటే అదే. ఎంత ఎదిగినా ఒదిగే మనస్తత్వం. అందుకే అతడు అంత గొప్ప ఆటగాడయ్యాడు’’ అని చెప్పుకొచ్చాడు.
 
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన తర్వాత భారత అభిమానులు అతిగా ప్రవర్తించారు. వారి నుంచి అతడు వేధింపులు ఎదుర్కొన్నాడు. బంగ్లా టైగర్ వేషధారణకు ప్రసిద్ధి గాంచిన షోయబ్ మ్యాచ్‌కు వచ్చిన ప్రతిసారి వెంట పులిబొమ్మను తెచ్చుకుంటాడు. మ్యాచ్ వీక్షిస్తున్న సమయంలో ఇండియన్ జెర్సీ ధరించిన ఓ వ్యక్తి ఆ పులి తోకలాగి వేధింపులకు గురిచేశాడు. మరో వ్యక్తి నవ్వుతూ అతడికి మద్దతు తెలిపాడు. ఆ తర్వాత ఆ పులిబొమ్మను లాక్కుని చింపేశారు. ఇది తనను తీవ్రంగా కలచివేసిందంటూ ఓ వీడియోలో షోయబ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇండియన్ ఫ్యాన్స్ నుంచి ఇలాంటి అనుభవం ఎదురవుతుందని తాను ఊహించలేకపోయానని పేర్కొన్నాడు. జెంటిల్మన్ గేమ్‌లో ఆటగాళ్లు మాత్రమే కాదని, అభిమానులు కూడా హుందాగా ప్రవర్తించాలని కోరాడు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో స్పందించిన భారత అభిమానులు షోయబ్‌కు క్షమాపణలు తెలిపారు.

More Telugu News