Ganta Srinivasa Rao: గంటా శ్రీనివాసరావుకు హైకోర్టులో ఊరట... కార్యకలాపాలను అడ్డుకోవద్దని పోలీసులకు ఆదేశాలు

  • తరుచూ సీఆర్పీసీ సెక్షన్ 151 కింద నోటీసులు ఇస్తున్నారని హైకోర్టుకు వెళ్లిన గంటా
  • తనకు సెప్టెంబర్‌లో ఇచ్చిన ఐదు నోటీసులు రద్దు చేయాలని విజ్ఞప్తి
  • ప్రజాప్రతినిధిని అడ్డుకోవడం సరికాదన్న హైకోర్టు
Relief to Ganta Srinivas Rao in high court

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని విశాఖ పోలీసులను ఏపీ హైకోర్టు ఆదేశించింది. విశాఖ పోలీసులు తనకు తరుచూ సీఆర్పీసీ సెక్షన్ 151 కింద నోటీసులు ఇచ్చి కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని, గృహనిర్బంధం చేస్తున్నారని గంటా హైకోర్టును ఆశ్రయించారు. తనకు సెప్టెంబర్‌లో ఇచ్చిన ఐదు నోటీసులను రద్దు చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం గంటాకు ఊరటనిచ్చింది. టీడీపీ నేతలను తరచూ గృహనిర్బంధం చేస్తూ, కార్యక్రమాలను అడ్డుకోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ పిటిషనర్‌ శాంతియుతంగా కార్యక్రమాలను నిర్వహించకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని గంటా తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గృహనిర్బంధం ఎందుకని అడిగినా కారణాలు చెప్పట్లేదన్నారు. శాంతియుతంగా బహిరంగ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకోవడం పౌరుల ప్రాథమికహక్కు అన్నారు. పోలీసులు పిటిషనర్ కదలికలను అడ్డుకుంటూ గొంతు నొక్కుతున్నారని, సీఆర్పీసీ సెక్షన్ 151ను ఉపయోగించి పిటిషనర్ కదలికలను అడ్డుకోవడానికి వీలులేదన్నారు.

కోర్టు జోక్యం చేసుకొని పోలీసులను నిలువరించకపోతే మరోసారి నిర్బంధించే అవకాశముందని పేర్కొన్నారు. సీఆర్పీసీ 151 నోటీసులు, గృహనిర్బంధ చర్యలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ప్రజాప్రతినిధిని అడ్డుకోవడం సరికాదని, పిటిషనర్ స్వేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహించుకునే విషయంలో అడ్డంకులు సృష్టించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.

More Telugu News