Atchannaidu: ఐదు నెలలు ఆగు పెద్దిరెడ్డీ... నీ సంగతేంటో చూస్తాం: అచ్చెన్నాయుడు

  • టీడీపీ కార్యకర్తల పసుపు చొక్కాలు విప్పించిన వైసీపీ నేతలు
  • పుంగనూరు మండలంలో ఘటన
  • కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలేది లేదన్న అచ్చెన్నాయుడు
  • టీడీపీలో తరం మారింది... యువరక్తం వచ్చిందంటూ వ్యాఖ్యలు
Atchannaidu warns minister Peddireddy

శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్తలు కుప్పం వరకు సైకిల్ ర్యాలీ చేపట్టగా, పుంగనూరు మండలంలో వారిని స్థానిక వైసీపీ నేతలు అడ్డుకున్నారు. ఆ టీడీపీ కార్యకర్తల పసుపు చొక్కాలు విప్పించి, టీడీపీ జెండాలు తీసేయించారు. పుంగనూరుకు చంద్రబాబునే రానివ్వలేదు... మీరెవర్రా పసుపు జెండాలతో రావడానికి... ఇది మంత్రి పెద్దిరెడ్డి అడ్డా అంటూ సదరు వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని కొట్టకుండా వదిలేస్తున్నాం సంతోషించండి అంటూ ఆ టీడీపీ కార్యకర్తలను పంపించివేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. 

ఈ నేపథ్యంలో, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏం పెద్దిరెడ్డీ... ఈ రాష్ట్రం నీ జాగీరు అనుకుంటున్నావా? అని మండిపడ్డారు. నువ్వసలు మనిషివేనా... ఐదు నెలల తర్వాత నీ పరిస్థితి ఏంటి? రాష్ట్రం వదిలి వెళ్లిపోతావా? అంటూ నిప్పులు చెరిగారు. 

"నీకసలు మానవత్వం ఉందా... చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పంకు టీడీపీ సామాన్య కార్యకర్తలు సైకిల్ ర్యాలీ చేస్తుంటే, పసుపు కండువాలు నా పుంగనూరులో కనబడకూడదు అంటూ నీ కుక్కలను పంపించి ఆ టీడీపీ కార్యకర్తలను దారుణంగా అవమానించావు. ఖబడ్దార్... పెద్దిరెడ్డీ! ఐదు నెలలు ఆగు... భూతద్దంతో వెదికినా కనబడకుండా చేసే బాధ్యత మా యువ నాయకుడు నారా లోకేశ్ తీసుకుంటాడు. 

గెలిచేంత వరకే టీడీపీ ఇలాంటి మాటలు చెబుతుంది అని చాలా మంది అనుకుంటుంటారు. గెలిచిన తర్వాత అమరావతి, పోలవరం, రోడ్లు, నీళ్లు అంటూ అభివృద్ధి పనులకే ప్రాధాన్యం ఇచ్చి కార్యకర్తలను పట్టించుకోరనే పిచ్చి భ్రమల్లో ఉన్నారు. ఇలాంటి వాళ్లు ఒక్క విషయం గమనించాలి... టీడీపీలో తరం మారింది... యువరక్తం వచ్చింది... గత నాలుగున్నరేళ్లలో టీడీపీ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలేది లేదని నారా లోకేశ్ ఇప్పటికే ప్రకటించారు" అంటూ అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు.

More Telugu News