Wide Ball Controversy: కోహ్లీకి వైడ్‌బాల్ వివాదంపై ఎట్టకేలకు స్పందించిన బంగ్లాదేశ్ స్టాండిన్ కెప్టెన్

  • జట్టు విజయానికి రెండు పరుగులు అవసరమైన వేళ 97 పరుగులతో క్రీజులో కోహ్లీ
  • కోహ్లీ సెంచరీ అడ్డుకునేందుకు వైడ్‌బాల్ వేశాడంటూ నాసుమ్‌పై విమర్శలు
  • ఆ బంతి వైడ్ కావడం ఉద్దేశపూర్వకం కాదన్న షాంటో
  • అలాంటి ప్లాన్ ఏదీ తమ వద్ద లేదన్న తాత్కాలిక కెప్టెన్
  • తాము సక్రమంగానే ఆడామంటూ నాసుమ్‌కు అండ 
Shanto Breaks Silence On Virat Kohli Wide Ball Controversy vs India

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీని అడ్డుకునే ఉద్దేశంతో వైడ్ బాల్ వేశాడంటూ బంగ్లాదేశ్ స్పిన్నర్ నాసుమ్ అహ్మద్‌పై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ బంగ్లాదేశ్ తాత్కాలిక కెప్టెన్ నజ్ముల్ హొసౌన్ షాంటో స్పందిస్తూ, ఆ ఆరోపణలను కొట్టిపడేశాడు. అలాంటి ఉద్దేశమేమీ లేదని స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత్ విజయానికి రెండు పరుగులు అవసరమైన వేళ కోహ్లీ 97 పరుగులతో క్రీజులో ఉన్నాడు. క్రీజులో ఉన్న కోహ్లీ మూడు పరుగులు చేస్తే సెంచరీ పూర్తికావడంతోపాటు జట్టుకు విజయం కూడా లభిస్తుంది. 

అయితే, నజ్ముల్ వేసిన బంతి లెగ్‌సైడ్ వెళ్లింది. నిజానికి అది వైడ్ బాల్. ఇది చూసిన స్టేడియంలోని ప్రేక్షకులు, టీవీల్లో మ్యాచ్‌ను వీక్షిస్తున్న వారు నజ్ముల్ కావాలనే ఆ బంతిని వైడ్‌గా సంధించాడని విమర్శించారు. కోహ్లీ సెంచరీని అడ్డుకునే కుట్ర ఇందులో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, నజ్ముల్ వేసిన ఆ బంతి వైడ్ అయినా ఆన్‌ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటెల్‌లోబోరో దానిని వైడ్‌గా ప్రకటించలేదు. ఆ తర్వాతి బంతిని కోహ్లీ స్టాండ్స్‌లోకి పంపాడు. దీంతో కోహ్లీ సెంచరీ పూర్తికావడంతోపాటు జట్టుకు విజయం లభించింది. 

కోహ్లీ చారిత్రాత్మక సెంచరీ పూర్తిచేసుకున్నా నజ్ముల్‌పై విమర్శలు మాత్రం ఆగలేదు. సెంచరీని అడ్డుకునేందుకే నజ్ముల్‌ దానిని వైడ్‌గా సంధించాడని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై తాజాగా పెదవి విప్పిన షాంటో.. అలా ఏమీ లేదని, తాము ఆటను సరిగానే ఆడామంటూ నజ్ముల్‌ను వెనకేసుకొచ్చాడు. ‘‘లేదు.. లేదు. మాకు అలాంటి ఆలోచనేదీ లేదు. కావాలని వైడ్ వేయాలని ఏ బౌలరూ అనుకోడు. మేము సక్రమంగా ఆడాలనే అనుకున్నాం. ఆ బంతి వైడ్ కావడం ఉద్దేశపూర్వకం కాదు’’ అని స్పష్టం చేశాడు.

More Telugu News