Justin Trudeau: భారత్ కొన్ని లక్షల మందిని కష్టాలపాలు చేస్తోంది..కెనడా ప్రధాని ఆరోపణ

 Indians crackdown on Canadian diplomats was making normal life difficult for millions says justin trudeau
  • దౌత్యసిబ్బంది సంఖ్య తగ్గించాలని భారత్ పట్టుపట్టడంపై ప్రధాని జస్టిన్ ట్రూడో అభ్యంతరం
  • దౌత్యసిబ్బంది తగ్గింపుతో వీసా, కాన్సులార్ సేవలకు అంతరాయం ఏర్పడిందని వెల్లడి
  • ఫలితంగా, ఇరు దేశాల్లో లక్షలాది మంది ఇబ్బందుల పాలవుతున్నారన్న ట్రూడో
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి భారత్‌పై తన అక్కసు వెళ్లబోసుకున్నారు. భారత్ చర్యలు ఇరు దేశాల్లోని లక్షలాది మందిని ఇక్కట్లపాలు చేస్తున్నాయని ఆరోపించారు. కెనడా దౌత్యవేత్తల ఉపసంహరణ అనంతరం శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దౌత్యవేత్తల తరలింపుతో భారత్‌లో కెనడా వీసా, కాన్సులార్ సేవలకు అంతరాయం ఏర్పడి పర్యాటక, వాణిజ్య రంగాల్లో అడ్డంకులు ఎదురవుతున్నాయని చెప్పారు. కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులూ సమస్యల పాలవుతారని అన్నారు.

‘‘దౌత్యసంబంధాల ప్రాథమిక నిబంధనలకు విరుద్ధంగా భారత్ వ్యవహరిస్తోంది. ఇరు దేశాల్లో ఉంటున్న లక్షలాది మందిని ఇక్కట్ల పాలు చేస్తోంది. కెనడాలో భారత మూలాలున్న అనేక మంది పౌరుల గురించి నాకు ఆందోళనగా ఉంది’’ అని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు.

కెనడా జనాభాలో దాదాపు 5 శాతం..అంటే సుమారు 20 లక్షల మంది భారత సంతతి వారు ఉన్నారు. అంతేకాకుండా, కెనడాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు సుమారు 40 శాతం మంది ఉన్నారు. 

సిక్కు వేర్పాటువాది, కెనడా పౌరుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత సీక్రెట్ ఏజెంట్లు ఉన్నారన్న ప్రధాని ట్రూడో ఆరోపణ ఇరు దేశాల మధ్య వివాదాన్ని రాజేసిన విషయం తెలిసిందే. కెనడాపై ఆగ్రహానికి గురైన భారత్ తమ దేశంలో కెనడా దౌత్యసిబ్బంది సంఖ్య తగ్గించుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు 41 మంది దౌత్యవేత్తలను కెనడా గురువారం వెనక్కు పిలిపించుకుంది. వీరిలో కెనడా వలసల శాఖకు చెందిన 27 మంది సిబ్బంది కూడా ఉండటంతో భారత్‌లో కెనడా కాన్సులార్ సేవలకు అంతరాయం ఏర్పడింది. న్యూఢిల్లీలోని కెనడా హైకమిషన్ మినహా ఇతర దౌత్యకార్యాలయాల్లో వీసా ప్రాసెసింగ్, కాన్సులార్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కెనడా ప్రకటించింది. దీని ఫలితంగా వీసాల జారీలో జాప్యం జరుగుతుందని కూడా కెనడా వలసల శాఖ పేర్కొంది.
Justin Trudeau
Canada
India

More Telugu News