USA: ఇద్దరు అమెరికన్ బందీలను విడిచిపెట్టిన హమాస్ ఉగ్రవాదులు

Hamas released 2 American Hostages On Humanitarian Grounds
  • మానవతా దృక్పథంతో ఇద్దరికి విముక్తి
  • ఆరోగ్యం క్షీణించడంతో తల్లి,కూతురిని వదిలిపెట్టిన ఉగ్రవాదులు
  • ఖతార్ ప్రయత్నాలు విజయవంతం
ఇజ్రాయెల్‌లో నరమేధం సృష్టించిన హమాస్ ఉగ్రవాదులు కాస్తంత దయచూపారు. భీకర దాడుల సమయంలో బందీలుగా చేసుకున్న దాదాపు 200 మందిలో ఇద్దరు అమెరికన్లను వదిలిపెట్టారు. జుడిత్ తై రనన్, ఆమె కూతురు 17 ఏళ్ల నటాలి రనన్‌ను విడిచిపెట్టారు. తల్లి జుడిత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండడంతో హమాస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఖతార్ చొరవ ఫలితంగా హమాస్ సాయుధ విభాగం ‘అల్-క్వాస్సామ్ బ్రిగేడ్స్’ ఈ నిర్ణయం తీసుకుంది. మానవతా దృక్పథంతో వారిద్దరిని విడిచిపెట్టినట్టు టెలిగ్రామ్ వేదికగా హమాస్ వెల్లడించింది. అయితే ఎప్పుడు, ఎక్కడ విడిచి పెట్టారనే వివరాలను తెలపలేదు.  

కాగా హమాస్ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్నవారిలో అత్యధికులు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతోంది. అయితే గాజా‌స్ట్రిప్‌కు తీసుకెళ్లినవారిలో కొందరు చనిపోయారని విచారం వ్యక్తం చేసింది. ఇక బందీలుగా ఉన్నవారిలో మైనర్ల సంఖ్య 20 దాకా, 10-20 సంవత్సరాల వయసున్నవారు దాదాపు 60 మంది వరకు ఉండొచ్చని ఇజ్రాయెల్ లెక్కగట్టింది. ఇక హమాస్ దాడుల తర్వాత 100-200 మంది తప్పిపోయారని ఇజ్రాయెల్ చెబుతోంది. కాగా అక్టోబర్ 7న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌లో భీకర నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. 75 ఏళ్ల ఇజ్రాయెల్ చరిత్రలో అతిపెద్దదిగా అభివర్ణిస్తున్న ఈ దాడిలో ఏకంగా 1400 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో అమాయక పౌరులే ఉన్నారు.
USA
Hamas
Israel
Israel-Hamas War

More Telugu News