Australia: అఫ్రిదికి 5 వికెట్లు... అయినప్పటికీ పాక్ ముందు కొండంత లక్ష్యం

  • బెంగళూరులో ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ ఢీ
  • వార్నర్, మార్ష్ సెంచరీల జోరు
  • ఆసీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 367 పరుగులు
  • ఆలస్యంగా పుంజుకున్న పాక్ బౌలర్లు
  • అప్పటికే భారీ స్కోరు సాధించిన ఆసీస్
Aussies set 368 runs target to Pakistan

వరల్డ్ కప్ లో ఇవాళ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ పోరులో ఆసీస్ ఇన్నింగ్స్ ఆసక్తికరంగా సాగింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ సెంచరీలతో చెలరేగడంతో తొలి వికెట్ కు 259 పరుగులు జోడించినప్పటికీ, ఆ తర్వాత ఆసీస్ ఇన్నింగ్స్ నిదానించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కంగారూలు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 367 పరుగులు చేశారు. 

పాక్ ప్రధాన పేసర్ షహీన్ అఫ్రిది 5 వికెట్లు తీసినప్పటికీ, అప్పటికే బోర్డుపై కొండంత స్కోరు నమోదైంది. ఆసీస్ ఇన్నింగ్స్ లో హైలైట్ అంటే వార్నర్, మిచెల్ మార్ష్ సెంచరీలే. వార్నర్ 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 163 పరుగులు చేశాడు. మార్ష్ 108 బంతుల్లో 10 ఫోర్లు, 9 సిక్సర్లతో 121 పరుగులు సాధించాడు. వీరు క్రీజులో ఉన్నంతసేపు పాక్ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఎలా వేసినా బంతిని బౌండరీకి దాటిస్తుండడంతో, ఏ బంతులు వేయాలో తెలియక అయోమయానికి గురయ్యారు. 

పాకిస్థాన్ జట్టులో అత్యంత వేగంగా బౌలింగ్ చేసే హరీస్ రవూఫ్ ను టార్గెట్ గా చేసుకుని వార్నర్, మార్ష్ రెచ్చిపోయారు. స్పిన్నర్ ఉసామా మిర్ బౌలింగ్ లోనూ భారీగా పరుగులు సాధించాడు. పాక్ పేలవ ఫీల్డింగ్ కూడా ఆసీస్ భారీ స్కోరుకు కలిసొచ్చింది. 

వార్నర్, మార్ష్ అవుటయ్యాక... అంత ధాటిగా మరెవరూ ఆడలేకపోయారు. మ్యాక్స్ వెల్ (0) డకౌట్ కాగా, స్టీవ్ స్మిత్ (7) నిరాశపరిచాడు. స్టొయినిస్ 21, వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ 13, లబుషేన్ 8, కెప్టెన్ కమిన్స్ 6 పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 5, హరీస్ రవూఫ్ 3, ఉసామా మిర్ 1 వికెట్ తీశారు.

More Telugu News