World cup: కోహ్లీ సెంచరీని అడ్డుకోవడానికే ఆ వైడ్ కావాలని వేశాడా..? బంగ్లాదేశ్ బౌలర్ తీరుపై అనుమానాలు.. వీడియో ఇదిగో!

  • కోహ్లీ సెంచరీని అడ్డుకోవడానికే చేశాడని ప్రచారం
  • అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో బెడిసికొట్టిన ప్లాన్
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
Bangladesh Star Tried To Deny Virat Kohli Century

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సిక్స్ బాది జట్టుకు విజయాన్ని, తన ఖాతాలో సెంచరీని వేసుకున్న విషయం తెలిసిందే. అయితే, కోహ్లీ సెంచరీ చేయకుండా అడ్డుకునేందుకు బంగ్లాదేశ్ బౌలర్ ప్రయత్నించాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. కోహ్లీ శతకం పూర్తిచేయకుండా కావాలనే వైడ్ బాల్ వేశాడని బంగ్లాదేశ్ స్పిన్నర్ నాసమ్ అహ్మద్ పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. అయితే, బౌలర్ ఉద్దేశాన్ని గుర్తించాడో లేదో కానీ అంపైర్ ఆ బాల్ ను వైడ్ గా ప్రకటించలేదు. ఆ తర్వాత భారీ సిక్స్ బాదిన కోహ్లీ ఇటు జట్టుకు విజయాన్ని కట్టబెడుతూ, అటు తన సెంచరీని కూడా పూర్తిచేసుకున్నాడు.

అసలేం జరిగిందంటే..
బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 257 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. ఓపెనర్లు ఔటయ్యాక బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 42వ ఓవర్ లో జట్టు విజయానికి మరో 2 పరుగులు కావాల్సి ఉండగా.. కోహ్లీ స్కోరు 97 పరుగులు. ఈ దశలో సెంచరీ సాధించేందుకు కోహ్లీ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి బంగ్లా బౌలర్ నసీమ్ ప్రయత్నించాడు. కావాలనే వైడ్ బాల్ వేశాడు. అయితే, అంపైర్ రిచర్డ్ కెటిల్ బొరో దానిని వైడ్ గా ప్రకటించలేదు. ఆ తర్వాత నసీమ్ వేసిన బంతిని కోహ్లీ సిక్స్ గా మలిచాడు. దీంతో సెంచరీ పూర్తిచేసుకోవడంతో పాటు జట్టుకు విజయాన్ని అందించాడు.

కోట్ల హృదయాలు గెలిచావు..
అంపైర్ రిచర్డ్ కెటిల్ బొరో తీసుకున్న నిర్ణయం (వైడ్ గా ప్రకటించకపోవడం) పై ట్విట్టర్ లో ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నిర్ణయంతో కొన్ని కోట్లాదిమంది హృదయాలను గెలిచారంటూ ఓ యూజర్ ట్వీట్ చేశారు. అయితే, మరికొంతమంది మాత్రం అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. నసీమ్ వేసిన బంతి వైడ్ అని క్లియర్ గా తెలుస్తున్నా వైడ్ గా ప్రకటించలేదని విమర్శిస్తున్నారు. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసింది కోహ్లీ కాదు, అంపైర్ రిచర్డ్ కెటిల్ బొరో అని కామెంట్ చేశారు. ఈ ఆరోపణలకు జవాబుగా మరో యూజర్ స్పందిస్తూ.. క్రికెట్ నియమనిబంధనల ప్రకారమే అంపైర్ రిచర్డ్ కెటిల్ బొరో నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ‘లా 42’ ప్రకారం.. బౌలర్ ఉద్దేశపూర్వకంగా నో బాల్ లేదా వైడ్ వేసినా అంపైర్ కలగజేసుకునే అధికారం ఉందని, వైడ్ లేదా నోబాల్ గుర్తించకుండా ఉండొచ్చని వివరించారు.

More Telugu News