Warsaw: బొమ్మలా నిలబడి జువెలరీ షాపులో యువకుడు నగల చోరీ!

  • పోలాండ్‌లోని వార్సా నగరంలో ఘటన 
  • షాపింగ్ సెంటర్లోని పలు దుకాణాల్లో యువకుడు చోరీ
  • సెక్యూరిటీ సిబ్బందికి చిక్కి చివరకు జైలుపాలు
Thief In Poland Poses As Mannequin Before Stealing Jewellery From Mall Arrested

పోలాండ్‌లో ఓ యువకుడు వినూత్న రీతిలో చోరీకి పాల్పడ్డాడు. షాపులో కొంతసేపు బొమ్మలా (మెనాక్విన్) నిలబడిన అతడు షాపు మూసేశాక అదను చూసుకుని నగలు దొంగిలించాడు. వార్సా నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు తొలుత ఓ షాపింగ్ సెంటర్‌లోని జువెలరీ షాపులోకి వెళ్లాడు. అక్కడ ఎవరికీ తెలీకుండా నగల ప్రదర్శన కోసం పెట్టిన మెనాక్విన్‌ల మధ్య తనూ ఓ బొమ్మలా నిలబడిపోయాడు. కెమెరాల దృష్టి తనపై పడకుండా ఇలా చేశాడు. అతడు కొంచెం కూడా కదలకపోవడంతో షాపులోని కస్టమర్లు, సెక్యూరిటీ సిబ్బందీ ఎవరూ అతడిని గుర్తించలేకపోయారు. 

షాపింగ్ సెంటర్ మూసేశాక యువకుడు తీరిగ్గా తనకు కావాల్సిన నగలు చోరీ చేశాడు. ఆ తరువాత ఓ రెస్టారెంట్‌కు వెళ్లి సుష్టుగా తిని ఆపై మరో దుస్తుల షాపులో దుస్తులు కూడా చోరీ చేశాడు. కానీ చివర్లో అతడిని దురదృష్టం వెంటాడడంతో సెక్యూరిటీ సిబ్బందికి దొరికిపోకతప్పలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడు మరో షాపింగ్ సెంటర్‌లో కూడా ఇలాగే చోరీకి పాల్పడ్డట్టు పోలీసులు తెలిపారు. నిందితుడికి 10 ఏళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉందని చెప్పారు.

More Telugu News