Bengaluru: సొంతూరికి వెళ్దామని నిండు గర్భిణి అయిన భార్యను రైలెక్కించి.. పరారైన భర్త!

  • ఇద్దరు పిల్లలు, భార్యతో కలిసి బెంగళూరులో రైలెక్కిన భర్త
  • వాటర్ బాటిల్ తెస్తానని వెళ్లి తిరిగిరాని వైనం
  • సూళ్లూరుపేట-చెన్నై స్టేషన్ల మధ్య పురిటినొప్పులు
  • రైలులోనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ
  • సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలింపు
Husband went missing after wife and children boarding into train

సొంతూరు వెళ్దామని చెప్పి నిండు గర్భిణి అయిన భార్యను రైలెక్కించిన భర్త.. నీళ్ల బాటిల్ తెస్తానని పరారయ్యాడు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన యబాబీ-మదీనా భార్యభర్తలు. బెంగళూరులో ఉంటున్న వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మదీనా నిండు గర్భిణి కావడంతో సొంతూరుకు వెళ్దామని చెప్పి గురువారం భార్యాపిల్లలతో కలిసి బెంగళూరులో యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు. అనంతరం నీళ్ల బాటిల్ తెస్తానని కిందికి దిగిన భర్త జాడ లేకపోవడంతో పిల్లలతో మదీనా రైలులోనే ఉండిపోయింది. ఈలోపు రైలు బయలుదేరింది. 

సూళ్లూరుపేట-చెన్నై స్టేషన్ల మధ్యకు వచ్చేసరికి మదీనాకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. గమనించిన తోటి ప్రయాణికులు విషయాన్ని రైలు సిబ్బందికి చెప్పడంతో వారు సూళ్లూరుపేట అధికారులకు తెలియజేశారు. మరోవైపు, పురిటినొప్పులు ఎక్కువై మదీనా రైలులోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రైలు సూళ్లూరుపేట చేరుకున్న తర్వాత అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న 108 సిబ్బంది ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన అధికారులు ఆమె భర్తను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. తనకు ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలని, మూడో కాన్పులోనూ అమ్మాయే పుడుతుందన్న అనుమానంతో భర్త తనను రైలు ఎక్కించి పరారయ్యాడని మదీనా కన్నీళ్లు పెట్టుకుంది.

More Telugu News