Telugudesam: చంద్రబాబు అరెస్ట్‌పై 37వ రోజూ కొనసాగిన నిరసనలు

tdp protest continue on 37th day
  • 'బాబుతో నేను' కార్యక్రమం ద్వారా ఇంటింట ప్రచారం, ప్రజావేదికలు నిర్వహణ
  • ర్యాలీలు, రైతు రథాలతో చంద్రబాబుకు సంఘీభావం
  • రైతు రథం ట్రాక్టర్లతో నిరసన తెలిపిన లబ్ధిదారులు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ టీడీపీ శ్రేణుల నిరసనలు 37వ రోజూ కొనసాగాయి. అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి సైకిల్ యాత్ర చేపట్టారు. సజ్జాపురం ఎస్సీ కాలనీ నుంచి పత్తేపురం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి లోహిత్ శ్రీకాళహస్తీశ్వరాలయంలోని శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబు ఎటువంటి మచ్చ లేకుండా అక్రమకేసు నుంచి త్వరగా బయటికి రావాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అర్చనలు, పూజలు చేయించారు.

తిరువూరు నియోజకవర్గ ఇంఛార్జ్ శావల దేవదత్ స్థానిక నాయకులతో కలిసి తిరువూరు పట్టణంలో వేంచేసి ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదోని టీడీపీ ఇంచార్జ్ శ్రీ మీనాక్షి నాయుడు ఆదోని నుండి ఉరుకుంద ఈరన్నస్వామి దేవాలయం వరకు పాదయాత్ర చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పాదయాత్రలో మంత్రాలయం ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి, పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, ఉమాపత్రి నాయుడు పాల్గొన్నారు.

మాజీ మంత్రి పరిటాల సునీత నవరాత్రుల సందర్భంగా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలోని ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో దీపోత్సవం నిర్వహించారు. 9 మంది మహిళల చేత ఒక్కొక్క మహిళ 365 దీపాలు కలిగిన వత్తి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు పేరు మీద అర్చనలు  చేయించారు. ఎలమంచిలి నియోజకవర్గం అశ్వాపురం మండలం పూడిమడక వద్ద పార్లమెంట్ అధ్యక్షులు బుద్దా నాగజగదీశ్వరావు, మాజీ ఎంపీ పప్పుల చలపతి రావు స్థానిక నాయకులతో కలిసి సముద్రంలోకి దిగి నిరసన తెలిపారు. సైకో పోవాలి.. సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు.

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో 58వ వార్డులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 2019 ఎంపీ అభ్యర్థి భరత్, టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

రాయదుర్గం నియోజకవర్గ రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. తెలుగుదేశం హయాంలో రైతురథం పథకం కింద లబ్ధిపొందిన రైతులు ఆ నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం గొనభావి గ్రామం వద్ద ట్రాక్టర్లతో చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. వ్యవసాయ పనులను మానుకుని వివిధ గ్రామాలకు చెందిన రైతులు గోవభావి వద్దకు చేరుకున్నారు. అనంతరం తమ ట్రాక్టర్లను వరుసగా నిలబెట్టి మేము సైతం బాబు కోసమంటూ నినదించారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడు వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో  సంఘీభావ పాదయాత్ర నిర్వహించగా పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


               

     
           

                            

Telugudesam
Chandrababu
dharna

More Telugu News