Deve Gowda: బీజేపీతో పొత్తు చిచ్చు.. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిపై వేటు వేసిన దేవెగౌడ

Deve Gowda removes Ibrahim from JDS state president post

  • బీజేపీతో పొత్తును వ్యతిరేకించిన ఇబ్రహీం
  • రాష్ట్ర తాత్కాలిక అధ్యక్షుడిగా కుమారస్వామిని నియమించిన దేవెగౌడ
  • పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమన్న కుమారస్వామి

బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జేడీఎస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పార్టీలో అంతర్గత విభేదాలకు దారి తీసింది. పార్టీ నిర్ణయాన్ని జేడీఎస్ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడ వేటు వేశారు. పార్టీ రాష్ట్ర విభాగాన్ని రద్దు చేశారు. కర్ణాటక రాష్ట్ర తాత్కాలిక అధ్యక్షుడిగా తన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని నియమించారు. 

ఈ సందర్భంగా మీడియాతో దేవెగౌడ మాట్లాడుతూ... కుమారస్వామి నాయకత్వానికి దేశ స్థాయిలో గుర్తింపు ఉందని చెప్పారు. అందుకే పార్టీ శాసనసభాపక్ష నేతగా, రాష్ట్ర అధ్యక్షుడిగా కుమారస్వామిని నియమించాలని అందరం నిర్ణయించామని తెలిపారు. మరో విడత చర్చలు జరిపిన తర్వాత రాష్ట్ర కార్యవర్గాన్ని నియమిస్తామని చెప్పారు. 

కుమారస్వామి మాట్లాడుతూ... పార్టీని బలోపేతం చేయడానికే రాష్ట్ర కార్యనిర్వాహక విభాగాన్ని తమ అధ్యక్షుడు దేవెగౌడ రద్దు చేశారని అన్నారు. తన నాయకత్వంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారని... ఈ విషయాన్ని ఇబ్రహీంకు తెలియజేస్తామని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని అన్నారు. మరోవైపు బీజేపీతో పొత్తును వ్యతిరేకించిన ఇబ్రహీం... భావసారూప్యత కలిగిన పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.

  • Loading...

More Telugu News