Shivaram arrest: ప్రవళిక ఆత్మహత్య కేసు.. శివరామ్ అరెస్ట్

  • పరారీలో ఉన్న శివరామ్ ను మహారాష్ట్రలో అరెస్టు చేసిన పోలీసులు
  • పెళ్లి పేరుతో మోసం చేయడంతోనే ప్రవళిక ఆత్మహత్య
  • తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు అధికారుల వెల్లడి
Shivaram Rathod is arrested at Thane in Pravalika Suicide Case

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రవళిక ఆత్మహత్యకు కారణమైన నిందితుడు, ఆమె ప్రియుడు శివరామ్ ను అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ నెల 13న ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడగా.. అప్పటి నుంచి శివరామ్ పరారీలో ఉన్నాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడి కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. ఈ క్రమంలో శివరామ్ మహారాష్ట్రకు పారిపోయినట్లు సమాచారం అందడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. థానెలో శివరామ్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ఇంతవరకూ అధికారికంగా ప్రకటించలేదు.

ప్రవళిక ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో శివరామ్ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, తన కూతురు మరణానికి కారణమయ్యాడని ఆరోపిస్తూ ప్రవళిక తల్లి ఓ వీడియో సందేశం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రవళిక తల్లిని, సోదరుడిని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్ కు పిలిపించుకున్నారు. కూతురు బలవన్మరణంతో బాధపడుతున్న ఆ తల్లిని ఓదార్చారు. మరోవైపు, ప్రవళిక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని, ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

More Telugu News