Dabur India: డాబర్ ఉత్పత్తులతో కేన్సర్..? యూఎస్, కెనడా కోర్టుల్లో కేసులు

Dabur India subsidiaries face cases in US Canada over cancer allegations
  • డాబర్ హెయిర్ స్ట్రయిటనర్, రిలాక్సర్ పై ఆరోపణలు
  • వీటితో ఒవేరియన్, యుటెరస్ కేన్సర్ వస్తుందన్న ఆందోళన
  • మూడు డాబర్ సబ్సిడరీలపై నమోదైన కేసులు
ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ డాబర్ వివాదాల్లో చిక్కుకుంది. డాబర్ కేశ సౌందర్య ఉత్పత్తులు కేన్సర్ కు కారణమవుతున్నాయంటూ అమెరికా, కెనడా న్యాయస్థానాల్లో కేసులు దాఖలయ్యాయి. డాబర్ కంపెనీకి చెందిన మూడు అనుబంధ సంస్థలు నమస్తే లేబరేటరీస్ ఎల్ఎల్ సీ, డెర్మోవివా స్కిన్ ఎసెన్షియల్స్ ఐఎన్ సీ, డాబర్ ఇంటర్నేషనల్ పై కేసులు నమోదైనట్టు డాబర్ ఇండియా ప్రకటన విడుదల చేసింది.

డాబర్ కేశ ఉత్పత్తులు ఒవేరియన్ కేన్సర్, యుటెరిన్ కేన్సర్ కు దారితీస్తున్నట్టు పిటిషనర్ల ఆరోపణగా ఉంది. పలు పేర్లతో డాబర్ హెయిర్ రిలాక్సర్, హెయిర్ స్ట్రయిటనర్ ఉత్పత్తులను ఓవర్ ద కౌంటర్ (వైద్యుల సిఫారసులు అవసరం లేకుండా) గా విక్రయిస్తోంది. మల్టీ డిస్ట్రిక్ట్ లిటిగేషన్ కింద 5,400 కేసులు దాఖలయ్యాయి. మల్టీ డిస్ట్రిక్ట్ లిటిగేషన్ అన్నది ప్రత్యేక న్యాయపరమైన ప్రక్రియ. సత్వర విచారణ కోసం వీలుగా ఈ మార్గంలో పిటిషన్లు దాఖలు చేయవచ్చు. 

శిరోజాలు నిగనిగ లాడుతూ, కోరుకున్న విధంగా ఉంచడంలో హెయిర్ స్ట్రెయిటనర్, హెయిర్ రిలాక్సర్ ఉత్పత్తులు సాయపడతాయి. వీటిల్లో ఎండోక్రైన్ వ్యవస్థకు విఘాతం కలిగించే కెమికల్స్ ను వాడుతుంటారు. వీటివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయనే వాదన ఉంది. సౌందర్య ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయంటూ గతంలోనూ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కేసులు దాఖలు కావడం గమనార్హం.
Dabur India
cancer allegations
law suits
USa
canada

More Telugu News