Indrasena Reddy: ఇంద్రసేనారెడ్డికి గవర్నర్ పదవి.. ప్రస్తుతం తెలంగాణ నుంచి ఇద్దరు గవర్నర్లు

  • గతంలో నాదెండ్ల భాస్కరరావును ఓడించిన చరిత్ర ఇంద్రసేనారెడ్డిది
  • ఏబీవీపీ ద్వారా ఇంద్రసేనారెడ్డి రాజకీయ ప్రస్థానం ప్రారంభం
  • ఇప్పటికే గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ
Telangana leader Indrasena Reddy appointed as Tripura Governor

తెలంగాణలో పట్టు సాధించాలనే కృతనిశ్చయంతో బీజేపీ హైకమాండ్ ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్ర బీజేపీ నేతలకు గవర్నర్, కేంద్ర మంత్రుల పదవులను కట్టబెడుతోంది. తాజాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరో కీలక పదవిని తెలంగాణ నేతలకు ఇచ్చింది. సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డిని త్రిపుర గవర్నర్ గా నియమించింది. ఇంద్రసేనారెడ్డి ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అండగా ఉంటూ... బీజేపీ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. 

ఇంద్రసేనారెడ్డిది సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గంలోని గానుగబండ గ్రామం. ఆయన రాజకీయ ప్రస్థానం ఏబీవీపీతో మొదలయింది. ఏబీవీపీలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పని చేశారు. ఆ తర్వాత బీజేవైఎం జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన చరిత్ర ఆయనది. 

1983లో తొలిసారి మలక్ పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఇంద్రసేనారెడ్డి గెలుపొందారు. అప్పట్లో హోంమంత్రిగా ఉన్న ప్రభాకర్ రెడ్డిని ఓడించి చరిత్ర సృష్టించారు. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. 1985లో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావును ఓడించారు. 1999లో మూడోసారి గెలిచి శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. 2003 నుంచి 2006 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 

మరోవైపు ఒడిశా గవర్నర్ గా ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ను నియమించారు. ఇంకోవైపు ఇప్పటికే తెలంగాణకు చెందిన మరో బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్ గా ఉన్న సంగతి తెలిసిందే.

More Telugu News