Dhulipalla Narendra Kumar: జగన్ దోపిడీకి అడ్డుకట్ట వేయలేని నిస్సహాయ స్థితిలో ఈ.ఆర్.సీ ఉండటం బాధాకరం: ధూళిపాళ్ల నరేంద్రకుమార్

  • జగన్ సర్కారు ఈ.ఆర్.సీ మెడపై కత్తి పెట్టిందన్న ధూళిపాళ్ల
  • కమీషన్ల కోసం బయటి నుంచి విద్యుత్ కొంటున్నారని ఆరోపణ
  • ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను గాలికొదిలేశారని ఆగ్రహం
Dhulipalla Narendra Kumar slams YCP govt

జగన్ సర్కార్ ఈ.ఆర్.సీ (ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్) మెడపై కత్తిపెట్టి మరీ  తన ఆటలు సాగిస్తోందని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ధ్వజమెత్తారు. కమీషన్ల కోసం అధిక ధరకు బయటనుంచి విద్యుత్ కొంటూ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను గాలికొదిలేస్తే అవి ఎలా మనుగడ సాగిస్తాయని ప్రశ్నించారు. జగన్ నెలానెలా పెంచుతున్న విద్యుత్ ఛార్జీలతో సామాన్యులు విద్యుత్ బోర్డుపై చెయ్యి పెట్టడానికే జంకుతున్నారని, ఈ.ఆర్.సీని వైసీపీ ప్రభుత్వం తన చెప్పుచేతుల్లో పెట్టుకున్నందునే, విద్యుత్ ఛార్జీల పెంపుపై సదరు విభాగం స్పందించలేని స్థితిలో ఉందని ఆరోపించారు. 

“ఈ.ఆర్.సీని అడ్డుపెట్టుకొనే జగన్ సర్కార్ విద్యుత్ బిల్లుల మోతమోగిస్తోంది. ఈ ప్రభుత్వంలోనే ఈ.ఆర్.సీ విచిత్రమైన నిర్ణయాలు తీసుకుంటోంది. పవర్ హాలిడేలు ఆమోదించే పరిస్థితికి ఈ.ఆర్.సీ ఎందుకొచ్చింది? కేంద్ర ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి తక్కువ ధరకు లభిస్తున్నా విద్యుత్ కొనకుండా జగన్ ప్రభుత్వం, బయట మార్కెట్లో ఎక్కువ ధరకు ఎందుకు కొంటోంది? 

ఇదివరకు ఇండస్ట్రీస్ లో క్యాప్టివ్ జనరేషన్ ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చాక స్థానిక పరిశ్రమలు, ఫ్యాక్టరీల్లో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు పెడితేనే క్యాప్టివ్ జనరేషన్ కు అనుమతిస్తామని మెలికపెట్టింది. ఇలాంటి తలతిక్క నిర్ణయాలతో ప్రజలపై భారంవేస్తూ, జగన్మోహన్ రెడ్డి మాత్రం విలాసాల్లో మునిగి తేలుతున్నాడు. 

టీడీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క పరిశ్రమ యాజమాన్యం కూడా న్యాయస్థానాలకు వెళ్లలేదు. రాష్ట్రం నుంచి సుజలాన్ సంస్థ ఎందుకు పోయింది.. నెల్లూరు సమీపంలోని గమేశా సంస్థ ఎందుకు మూతపడింది? వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల కాదా? నేడు ఎక్కడా విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమల కార్యకలాపాలు సాగడం లేదు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏకంగా జగన్ సర్కార్ పై కేంద్ర ప్రభుత్వానికే ఫిర్యాదు చేశాయి. 

ప్రభుత్వ రంగంలోని జెన్ కో, వీటీపీఎస్ లాంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థల సామర్థ్యం పెంచే పనిచేయకుండా, కమీషన్ల కోసం బయటినుంచి విద్యుత్ కొంటే ఆ సంస్థలు ఎలా నిలబడతాయి? 9వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని, చంద్రబాబు ఐదేళ్లలో 19వేల మెగావాట్లకు పెంచితే, జగన్ రెడ్డి నాలుగున్నరేళ్లలో విద్యుత్ రంగాన్నే నామరూపాలు లేకుండా చేశాడు.

రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థల సామర్థ్యం పెంచకుండా, రాజస్తాన్ లోని అదానీ సంస్థ నుంచి అధిక ధరకు విద్యుత్ కొనాల్సిన అవసరం ఏమిటి? గుజరాత్ ప్రభుత్వం సెకీ ద్వారా యూనిట్ విద్యుత్ 1.99పైసలకు కొంటుంటే, ఏపీ ప్రభుత్వం రూ.2.49 పైసలకు ఎందుకు కొంటోంది? ఒక్కో ట్రాన్స్ ఫార్మర్ ధర బయట మార్కెట్లో రూ.75 వేలు ఉంటే, షిరిడిసాయి సంస్థ నుంచి జగన్ ప్రభుత్వం రూ.1,35,000లకు కొనడం కమీషన్ల కోసం కాదా? 

2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో 1051.6 కిలోల వాట్ల విద్యుత్ అందుబాటులో ఉంటే, 2019 నాటికి దాన్ని 1289.4 కిలోవాట్లకు పెంచింది. అదే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఈ నాలుగున్నరేళ్లలో 1289.4 కిలోవాట్ల సామర్థ్యాన్ని కేవలం 1370 కిలోవాట్లకు మాత్రమే పెంచగలిగాడు. 

టీడీపీ ప్రభుత్వం 280 కిలోవాట్ల సామర్థ్యం పెంచితే, జగన్ రెడ్డి చచ్చీచెడి కేవలం 81కిలోవాట్ల సామర్థ్యం మాత్రమే పెంచగలిగాడు. ముఖ్యమంత్రికి విద్యుత్ రంగంపై అవగాహన లేకపోవడం.. ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిపై శ్రద్ధపెట్టక పోవడమే ఇందుకు కారణం. 

రాష్ట్రప్రగతికి విద్యుత్ రంగం చాలా కీలకమైంది. జగన్ రెడ్డి, ఆయన బినామీ కంపెనీలు తప్ప, ఇతర పరిశ్రమలు, సంస్థలు ఏవీ రాష్ట్రంలో ఉండకూడదు. ప్రభుత్వం రాయితీలు కూడా వాళ్ల పార్టీ వారి కంపెనీలకే ఇస్తుంది” అని నరేంద్ర ఆరోపించారు.

More Telugu News