KCR: సిద్ధిపేట సభలో హరీశ్ రావుపై జోకు చెప్పి నవ్వించిన కేసీఆర్

  • సిద్ధిపేటలో నేడు బీఆర్ఎస్ ప్రజాశీర్వాద సభ
  • హాజరైన సీఎం కేసీఆర్
  • హరీశ్ రావును బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని పిలుపు
  • హరీశ్ తన మాట నిలబెట్టాడని కితాబు
KCR tells joke on Harish Rao

ఇవాళ సిద్ధిపేట ప్రజాశీర్వాద సభలో ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. తన మేనల్లుడు, మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు గురించి సీఎం కేసీఆర్ ఓ జోకు చెప్పారు. "హరీశ్ రావు ఈడ తిరుగుతాడు, ఆడ తిరుగుతాడు... ఎక్కడన్నా తట్టెడు పేడ కనిపిస్తే తీసుకెళ్లి సిద్ధిపేటలో వేసుకుంటాడు అని చెప్పుకుంటారు. తన నియోజకవర్గంపై హరీశ్ కు అంత శ్రద్ధ ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి పథకం, కార్యక్రమం సిద్ధిపేటలో రావాల్సిందే.

తెలంగాణలో సిద్ధిపేటకు ఓ ప్రత్యేక స్థానం ఉందంటే దాని వెనుక హరీశ్ కృషి ఉంది. నేను సిద్ధిపేట ఎమ్మెల్యే అయినా ఇంత అభివృద్ధి చేసేవాడ్ని కాదేమో. గత ఎన్నికలను మించిపోయేలా హరీశ్ ను ఈసారి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలి" అని కేసీఆర్ పిలుపునిచ్చారు. 

గతంలో తెలంగాణ ఉద్యమం కోసం తాను దేశ రాజధానిలోనూ బాణీ వినిపించాల్సి వచ్చిందని, దాంతో కరీంనగర్ ఎంపీగా ఎన్నికై ఢిల్లీ వెళ్లానని సీఎం కేసీఆర్ వివరించారు. ఉద్యమం కోసం తాను రాష్ట్రాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం వచ్చిందని, కరీంనగర్ లో సమావేశం ఏర్పాటు చేసుకుని అందరం పది నిమిషాల పాటు ఏడ్చేశామని వెల్లడించారు. 

ఆ తర్వాత సిద్ధిపేటకు ఉపఎన్నిక వచ్చిందని, ఆరు అడుగుల బుల్లెట్ హరీశ్ రావును నియోజకవర్గ ప్రజలకు అప్పగించానని తెలిపారు. హరీశ్ తాను ఊహించినదానికంటే ఎన్నో రెట్లు మెరుగ్గా పనిచేసి తన మాట నిలబెట్టాడని మేనల్లుడిపై ప్రశంసల వర్షం కురిపించారు.

More Telugu News