ICC World Cup: వరల్డ్ కప్: దక్షిణాఫ్రికా టార్గెట్ 246 రన్స్

  • ధర్మశాలలో నేడు దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన డచ్ జట్టు
  • వర్షం వల్ల ఓవర్లు 43కి కుదింపు
  • నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్లకు 245 పరుగులు చేసిన నెదర్లాండ్స్
Nederlands set South Africa s46 runs target

వరల్డ్ కప్ లో నేడు దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైన ఈ పోరులో నెదర్లాండ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. వర్షం కారణంగా ఓవర్లను 43కు కుదించారు. దక్షిణాఫ్రికా బౌలింగ్ దాడులకు టాపార్డర్ దాసోహం అన్నప్పటికీ, లోయరార్డర్ పోరాటపటిమతో నెదర్లాండ్స్ మంచి స్కోరు సాధించింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత 43 ఓవర్లలో 8 వికెట్లకు 245 పరుగులు చేసింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 78 పరుగులతో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 69 బంతులు ఎదుర్కొన్న ఎడ్వర్డ్స్ 10 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. నెదర్లాండ్స్ జట్టులోని తెలుగు ఆటగాడు తేజ నిడమానూరు 20 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. భారత సంతతికి చెందిన మరో ఆటగాడు ఆర్యన్ దత్ ఆఖర్లో దూకుడుగా ఆడాడు. ఆర్యన్ దత్ 9 బంతుల్లో 3 సిక్సర్లు బాది 23 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

గతంలో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం నెదర్లాండ్స్ తరఫున ఆడుతున్న వాన్ డెర్ మెర్వ్ 19 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 29 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగిడి 2, మార్కో యాన్సెన్ 2, కగిసో రబాడా 2, గెరాల్డ్ కోట్జీ 1, కేశవ్ మహరాజ్ 1 వికెట్ తీశారు. 

అనంతరం, 246 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా ఆచితూచి ఆడుతోంది. 4 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు వికెట్ నష్టపోకుండా 15 పరుగులు. కెప్టెన్ టెంబా బవుమా 6, క్వింటన్  డికాక్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

More Telugu News