Kala Venkata Rao: వారిద్దరి మాటలు చూస్తుంటే తమ స్థానాలను, బాధ్యతలను పూర్తిగా విస్మరించారని అర్థమవుతోంది: కళా వెంకట్రావు

  • చంద్రబాబును దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారన్న కళా వెంకట్రావు
  • టీడీపీ అధినేత ఆరోగ్య సమాచారాన్ని వెంటనే వెల్లడించాలని డిమాండ్
  • జగన్, సజ్జల దిగజారిపోయారంటూ విమర్శలు
Kala Venkatarao take a swipe at CM Jagan and Sajjala

చంద్రబాబుని మానసికంగా, భౌతికంగా దెబ్బతీయాలన్నదే తాడేపల్లి ప్యాలెస్ కుట్ర అని టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు ధ్వజమెత్తారు. టీడీపీ అధినేత ఆరోగ్య సమాచారాన్ని ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆత్మవిశ్వాసం, మనోస్థైర్యం దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జగన్మో హన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 రోజులుగా టీడీపీ అధినేతను జైల్లో పెట్టి, కావాలనే చంద్రబాబు ఆరోగ్య సమాచారం బయటకు తెలియనీయకుండా వైద్యుల్ని, జైలు అధికారుల్ని కట్టడి చేస్తున్నారని ఆరోపించారు. 

మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కళా వెంకట్రావు ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుకి జైల్లో 14వ తేదీన వైద్యపరీక్షలు నిర్వహించిన వారు, నేటికీ ఆ పరీక్షల వివరాలు ఎందుకు బయటపెట్టలేదు? అని ప్రశ్నించారు. 

"చర్మ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి వైద్యపరీక్షలు నిర్వహిస్తే, వాటికి సంబంధించిన రిపోర్టులు బయటపెట్టకపోవడాన్ని కుట్ర అనక ఏమనాలి? సొంత బాబాయ్ ను తన రాజకీయ ప్రయోజనాల కోసం చంపించిన వ్యక్తి, చంద్రబాబులాంటి గొప్ప నాయకుడి విషయంలో కుట్రలు చేయకుండా ఉంటాడా? 

ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని కుట్రలకు నాంది పలుకుతుంటే, సకల శాఖల మంత్రేమో వాటిని అమలుచేయడంపై దృష్టి పెడుతున్నాడు. వారిద్దరి మాటలు, చేతలు చూస్తుంటే, వారు పూర్తిగా తాము ఉన్న స్థానాలు, వాటి తాలూకా బాధ్యతల్ని పూర్తిగా విస్మరించారని అర్థమవుతోంది. తమ కుట్రల కోసం రాజ్యాంగ వ్యవస్థలనే వినియోగించుకునే స్థాయికి వారు దిగజారారు. ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించిన నివేదికల్ని బయటపెట్టాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం" అని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి ఎన్ని ఆంక్షలు పెట్టినా... ప్రజలు భువనేశ్వరిని కలవడం ఖాయం... ఆమె వారితో మాట్లాడడం ఖాయం

భువనేశ్వరిని కలవడానికి వెళ్లే వారిపై ప్రభుత్వం ఆంక్షలు ఎందుకు పెడుతోంది? ఆమెకు మద్దతుగా ప్రజల నుంచి వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేకే, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా? భువనేశ్వరిని కలవడానికి కొల్లు రవీంద్ర సారథ్యంలో బీసీలు బయలుదేరితే, ఆయన్ని అక్రమంగా నిర్బంధిస్తారా? 

జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి కావడం వల్లే ఇలాంటి అర్థంపర్థంలేని ఆంక్షలు రాష్ట్రంలో అమలుచేస్తున్నారు. జగన్ సభలకు అంగన్ వాడీలను, డ్వాక్రా మహిళల్ని, ఇతరుల్ని బలవంతంగా తరలించినా... బీర్లు, బిర్యానీలు అందించినా వారు ఎవరూ సభ ముగిసేవరకు నిలబడడం లేదు. ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభంకాగానే బారికేడ్లు దూకి మరీ పారిపోతున్నారు. 

ప్రజలు తనను పట్టించుకోకుండా... చంద్రబాబుని, ఆయన కుటుంసభ్యుల్ని పట్టించుకోవడాన్ని, వారి గురించి ఆలోచించడాన్ని ముఖ్యమంత్రి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే టీడీపీ నేతలతో పాటు, భువనేశ్వరికి మద్ధతు తెలపడానికి వెళ్లే ప్రజల్ని కూడా నిర్బంధిస్తున్నారు.

ముఖ్యమంత్రి ఆంక్షలకు భయపడేవారు ఎవరూ లేరు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రజా స్పందన విషయంలో రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తే మంచిది. భువనేశ్వరిని కలవడానికి ప్రజలు వెళ్లడం ఖాయం.. ఆమె వారితో మాట్లాడటం తథ్యం” అని కళా వెంకట్రావు స్పష్టం చేశారు.

More Telugu News