Supreme Court: స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించలేం: సుప్రీంకోర్టు

  • దీనిపై నిర్ణయాధికారం పార్లమెంట్ దేనని వ్యాఖ్య
  • స్వలింగ జంటల సమస్యల పరిష్కారానికి కమిటీ వేయాలని ప్రభుత్వానికి సూచన
  • రేషన్ కార్డులు, పెన్షన్, గ్రాట్యుటీ.. విషయంలో సాధ్యాసాధ్యాలు పరిశీలించాలన్న కోర్టు
Supreme Court Refuses To Legalise Same Sex Marriage Leaves It To Parliament

స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని న్యాయస్థానం నిర్ణయించజాలదని పేర్కొంది. సేమ్ సెక్స్ మ్యారేజ్ లకు గుర్తింపు, చట్టబద్ధత కల్పించే అధికారం పార్లమెంట్ దేనని స్పష్టతనిచ్చింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

ఇలాంటి వివాహాలు చేసుకున్న జంటలకు రేషన్ కార్డులు, పెన్షన్, గ్రాట్యుటీలతో పాటు వారసత్వ హక్కులు కల్పించే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో ఎదురయ్యే ఇతరత్రా సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలను గుర్తించేందుకు కేబినెట్ సెక్రెటరీ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అదే సమయంలో స్వలింగ వివాహాలకు సమాన హోదా కట్టబెట్టేందుకు మాత్రం కోర్టు నిరాకరించింది.

ఈమేరకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. కాగా, పిల్లలను దత్తత తీసుకునేందుకు స్వలింగ జంటలకు అవకాశం కల్పించాలని ఐదుగురు న్యాయమూర్తుల్లో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తో పాటు జస్టిస్ ఎస్ కే కౌల్ అభిప్రాయ పడ్డారు. అయితే, బెంచ్ లోని మిగతా ముగ్గురు జడ్జిలు.. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ హిమా కోహ్లీ దీనిని వ్యతిరేకించారు.

More Telugu News