Chandrababu: చంద్రబాబు అరెస్ట్ కు నిరసగా వరుసగా 34వ రోజు కూడా దీక్షలు... వివరాలు ఇవిగో!

  • స్కిల్  కేసులో చంద్రబాబు అరెస్ట్
  • వరుసగా 34వ రోజు కొనసాగిన టీడీపీ దీక్షలు
  • పార్లమెంటు కేంద్రాల్లో సైకిల్ ర్యాలీలు
  • కొల్లు రవీంద్రను అదుపులోకి తీసుకున్న పోలీసులు
TDP protests continue for 34th day

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని నిరసిస్తూ, ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ టీడీపీ శ్రేణుల నిరసనలు 34వ రోజు కూడా కొనసాగాయి. బీసీ విభాగం తరఫున పార్లమెంట్ కేంద్రాల్లో నారా భువనేశ్వరికి మద్దతుగా సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. మచిలీపట్నంలో సైకిల్ యాత్రను చేపట్టిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

చంద్రబాబుకు త్వరగా బెయిల్ రావాలని కోరుకుంటూ ప్రొద్దుటూరు ఇంఛార్జ్ డాక్టర్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో స్థానిక శివాలయంలో పూజలు నిర్వహించారు. 108 టెంకాయలు కొట్టారు. కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ తలపెట్టిన తొమ్మిది రోజుల నవగ్రహ శాంతి హోమంలో భాగంగా నాలుగో రోజు జగ్గంపేట నియోజకవర్గం బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వేములకొండ జోగారావు, అశ్విని దంపతులు పీటలపై కూర్చుని హోమం నిర్వహించారు. 

చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మదనపల్లిలో దొమ్మలపాటి రమేష్ ఆధ్వర్యంలో దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఉంగుటూరు నియోజకవర్గంలో రిలే నిరహార  దీక్షలు చేపట్టారు. 

విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కరపత్రాలను పంపిణీ చేశారు. తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో 'బాబుతో నేను' రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వారికి సంఘీభావం తెలియజేశారు.

సత్తెనపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో పట్టణంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరులో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. మంత్రాలయం నియోజకవర్గం ఇంఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

చంద్రబాబుకు మద్దతుగా పల్నాడు జిల్లా కోటప్పకొండపై టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముమ్మిడివరం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ దాట్ల బుచ్చిబాబు సైకిల్ ర్యాలీ చేపట్టారు.

More Telugu News