Christopher Luxon: న్యూజిలాండ్ నూతన ప్రధాని క్రిస్టోఫర్ లుక్సోన్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

  • ఇటీవల న్యూజిలాండ్ పార్లమెంట్ ఎన్నికలు
  • అధికార లేబర్ పార్టీకి భంగపాటు
  • విజయం సాధించిన నేషనల్ పార్టీ కూటమి
  • కలిసి పనిచేద్దామని లుక్సోన్ కు ప్రధాని మోదీ స్నేహ హస్తం 
PM Modi congratulate New Zealand newly elected prime minister Christopher Luxon

ఇటీవల న్యూజిలాండ్ లో జరిగిన ఎన్నికల్లో క్రిస్టోఫర్ లుక్సోన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. నేషనల్ పార్టీకి చెందిన లుక్సోన్ పై న్యూజిలాండ్ లో మెజారిటీ ప్రజలు నమ్మకం ఉంచారు. న్యూజిలాండ్ పార్లమెంటులో 121 సీట్లు ఉండగా... నేషనల్ పార్టీ 50, వారి భాగస్వామ్య పక్షం ఏసీటీ పార్టీ 11 స్థానాల్లో గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీకి 34 స్థానాలు మాత్రమే లభించాయి. క్రిస్టోఫర్ లుక్సోన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నేషనల్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. 

ఈ నేపథ్యంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఎన్నికల్లో విజయం సాధించిన క్రిస్టోఫర్ లుక్సోన్ ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్టు తెలిపారు. భారత్-న్యూజిలాండ్ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు లుక్సోన్ తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్టు వెల్లడించారు. 

క్రిస్టోఫర్ లుక్సోన్ గతంలో ఐస్ క్రీమ్ లు, డియోడరెంట్లు అమ్మారు. ఎయిర్ లైన్ ఎగ్జిక్యూటివ్ గానూ పనిచేశారు. న్యూజిలాండ్ లో ప్రజల జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోవడం, మూడు దశాబ్దాల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం చేరుకోవడం వంటి అంశాలను అజెండాగా చేసుకుని లుక్సోన్ నాయకుడిగా ఎదిగారు. దేశానికి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేస్తానని, రుణ విముక్త న్యూజిలాండ్ ను ఆవిష్కరిస్తానని ప్రజల్లో నమ్మకం కలిగించారు.

More Telugu News