Puvvada Ajay Kumar: అయిదేళ్లకోసారి పార్టీ మారే అవకాశవాది... తుమ్మల: పువ్వాడ అజయ్ విమర్శలు

  • తుమ్మల వల్ల బీఆర్ఎస్‌కు ఒరిగిందేమీ లేదన్న పువ్వాడ అజయ్
  • ఇంట్లో కూర్చున్న తుమ్మలకు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇచ్చారని వ్యాఖ్య
  • 2018 ఎన్నికల్లో ఖమ్మంలో గుండు సున్నా చుట్టారని ఎద్దేవా
  • ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్‌లను మోసం చేశారని ఆరోపణ
Puvvada Ajay fires at thummala nageswara rao

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వల్ల బీఆర్ఎస్‌కు ఒరిగిందేమీ లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పువ్వాడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఇవాళ ఓ మహానుభావుడు అవకాశవాదంతో ప్రతి అయిదేళ్లకు ఓ పార్టీ మారుతూ వస్తున్నాడని తుమ్మలను ఉద్దేశించి విమర్శించారు. ఆయనకు కేసీఆర్ అనేక అవకాశాలు ఇచ్చారన్నారు. ఓడిపోయి ఇంట్లో కూర్చున్న తుమ్మలను పిలిచి మంత్రి పదవి ఇచ్చి, ఎమ్మెల్సీని చేసి, ఆ తర్వాత ఎమ్మెల్యేగా చేసి, అనంతరం జిల్లా బాధ్యతలు అప్పగించి గెలిపించమంటే 2018 ఎన్నికల్లో ఖమ్మంలో గుండు సున్నా చుట్టారన్నారు. ఆ ఎన్నికల్లో తానొక్కడినే గెలిచానని పువ్వాడ అన్నారు.

పార్టీకి, కేసీఆర్‌కు తుమ్మల చేసిందేమీ లేదన్నారు. కానీ ఆయనకు మాత్రం కేసీఆర్ ఎంతో చేసారని చెప్పారు. అయినా తమకు అన్యాయం జరిగిందని, టిక్కెట్ రాలేదని కేసీఆర్‌ను తూలనాడుతూ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. 2018లో ఒకరిపై మరొకరు కత్తి దూసుకొని తొమ్మిది సీట్లలో ఓడగొట్టారని, తాను మాత్రమే వారిద్దరి కత్తిని తప్పించుకొని గెలిచానన్నారు. ఈ రోజు కత్తులు దూసుకున్న వారిద్దరు ఖమ్మంపై బందిపోట్లలా పడ్డారన్నారు.  తాను బీ-ఫారం తీసుకునేందుకు హైదరాబాద్ వెళ్తే ఖమ్మంలో కొందరు బందిపోటు దొంగలు చొరబడ్డారన్నారు. దమ్ముంటే తాను ఖమ్మంలో ఉన్నప్పుడు వస్తే వారికి సినిమా చూపించేవాడినన్నారు.

మొన్న ఎన్టీఆర్‌ను, నిన్న చంద్రబాబులను మోసం చేశాడని, ఇప్పుడు కేసీఆర్‌నూ మోసం చేశాడని ఆరోపించారు. రేపు కాంగ్రెస్ పార్టీని మోసం చేయడనే గ్యారెంటీ ఏమిటన్నారు. పాలేరులో గెలిపిస్తే అక్కడకు వెళ్తారని, లేదంటే ఖమ్మం వస్తాడన్నారు. ఆయనకు ఖమ్మం రెండో ప్రాధాన్యత అన్నారు. ఖమ్మంలో అత్యధిక సీట్లలో బీఆర్ఎస్‌ను గెలిపించి కాంగ్రెస్‌ను తరిమి కొట్టాలన్నారు.

More Telugu News