KCR: ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దు: సీఎం కేసీఆర్

  • జనగామలో బీఆర్ఎస్ సభ
  • మనం ఎలా ఓటు వేస్తామో మన కర్మ అలానే ఉంటుందన్న కేసీఆర్
  • మంచి చెడు చూసి ఓటేయాలని పిలుపు
  • కాంగ్రెస్ నేతలను బంగాళాఖాతంలో పడేయాలని వ్యాఖ్యలు
KCR speech in Janagaon

జనగామ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ విపక్షాలపై ధ్వజమెత్తారు. ధరణి పోర్టల్ ను తీసేసి బంగాళాఖాతంలో వేయాలని విపక్షాలు అంటున్నాయని, రైతుల మీద  మళ్లీ అధికారులను రుద్దాలని విపక్షాలు ఆలోచిస్తున్నాయని ఆరోపించారు. వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలంటున్న కాంగ్రెస్ నేతలను బంగాళాఖాతంలో కలపాలని అన్నారు. 

ఎన్నికలప్పుడు వచ్చి కొందరు ఆపద మొక్కులు మొక్కుతుంటారని, అలాంటి వాళ్లను నమ్మొద్దని అన్నారు. మనం ఎలా ఓటు వేస్తామో మన కర్మ అలానే ఉంటుందని ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. మంచి చెడు చూసుకుని ఓటేయాలని పిలుపునిచ్చారు. ఇక, ఓట్ల కోసమే బీఆర్ఎస్ మేనిఫెస్టో అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను కేసీఆర్ ఖండించారు. ఓట్ల కోసం అబద్ధాల మేనిఫెస్టో పెట్టాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. 


నాకు రైతుల కష్టాలు తెలుసు

తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నారని, వారికి తమ భూమిపై పూర్తి యాజమాన్య హక్కులు ఉండాలనే ధరణి పోర్టల్ తీసుకువచ్చామని సీఎం కేసీఆర్ వివరించారు. తనకు రైతుల కష్టాలు తెలుసని, అందుకే రెవెన్యూ అధికారుల చేతిలో ఉండే అధికారాలను రైతుల చేతిలో పెట్టానని వివరించారు. రైతు వేలిముద్ర ఉంటే తప్ప భూమి జోలికి ఇంకెవరూ పోలేరని అన్నారు.

కొన్ని జిల్లాలకు వెళితే ఏడుపొచ్చేది

తెలంగాణ రాష్ట్రం సాకారం కాకముందు కొన్ని జిల్లాలకు వెళితే తనకు కళ్ల వెంట నీళ్లు తిరిగేవని సీఎం కేసీఆర్ చెప్పారు. జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల పరిస్థితి దయనీయంగా ఉండేదని తెలిపారు. ఉద్యమం సాగుతున్న రోజుల్లో బచ్చన్నపేట వెళితే ఊరిలో ఒక్క యువకుడు కూడా కనిపించలేదు... అందరూ ఉపాధి కోసం ఎక్కడెక్కడికో వలస వెళ్లారని తెలిసి బాధ కలిగించిందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడా పరిస్థితి లేదని, బచ్చన్నపేటలో సంవత్సరం పొడవునా నీళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తెలంగాణలో పరిస్థితులు మెరుగుపడడంతో పెట్టుబడులు భారీగా వస్తున్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. 

కొందరు మతం పేరిట కల్లోలాలు సృష్టించాలని భావిస్తున్నారు

తెలంగాణలో సకల వర్ణాల ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని, అన్ని మతాల వారు కలిసిమెలిసి జీవిస్తున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇటీవల వినాయక నిమజ్జనం నాడే మిలాద్ ఉన్ నబీ పండుగు కూడా వచ్చిందని, అయితే ఎవరూ అడగకముందే ముస్లిం పెద్దలు తమ వేడుకను ఒకరోజు వాయిదా వేసుకున్నారని వివరించారు. కానీ, కొందరు వచ్చి మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. 

More Telugu News