High Blood Pressure: హైబీపీతో బాధపడుతున్నారా?.. ఇలా చేస్తే నియంత్రణలోనే!

  • బీపీ బాధితులుగా మారుతున్న జనం
  • 79 ఏళ్ల వయసున్న వారిలో 32 శాతం మంది మహిళలు, 34 శాతం మంది పురుషుల్లో హైబీపీ
  • కూరగాయాలు, ఆకుకూరలు, పండ్ల ద్వారా సహజంగా నియంత్రణ
Try these foods to naturally reduce high blood pressure

ఇటీవలి కాలంలో జనాన్ని వేధిస్తున్న సమస్యలో అధిక రక్తపోటు ఒకటి. చాపకింద నీరులా పాకిపోతున్న హైబీపీ జనాల ప్రాణాలను అకస్మాత్తుగా హరిస్తోంది. బీపీతో బాధపడేవారు రోజూ మాత్రలు మింగడం తప్పనిసరి. అయితే, మంచి ఆహారం తీసుకోవడం ద్వారా కూడా బీపీని నియంత్రించుకోవచ్చు. నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ చెబుతున్న దాని ప్రకారం 2019లో 30 నుంచి 79 ఏళ్ల మధ్యనున్న వారిలో  32 మంది మహిళలు, 34 శాతం పురుషులు హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నారు. హైబీపీ గుండెపోటు, గుండె జబ్బులకు దారితీస్తుంది. కిడ్నీలు కూడా విఫలమవుతాయి. కాబట్టి రక్తపోటును 80/120గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లైఫ్‌స్టైల్‌ను మార్చుకోవడం అంటే.. బరువు తగ్గడం, ఆహారంలో సోడియంను తగ్గించుకోవడం, క్రమం తప్పక వ్యాయామాలు చేయడం ద్వారా కూడా రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవచ్చు. 

మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారం
   
మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా కూడా బీపీని నియంత్రించుకోవచ్చు. మెగ్నీషియం కండరాల పైబర్‌ విశ్రాంతికి తోడ్పడుతుంది. మంట తగ్గిస్తుంది. మెటబాలిజం ఇన్సులిన్ విషయంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఆహారంలో బాదం, జీడిపప్పు, బచ్చలికూర, ఇతర ఆకుకూరలు, బీన్స్, కాయధాన్యాలు, చిక్కుళ్లు, ఓట్స్, బంగాళదుంపలు, స్వీట్‌కార్న్ వంటి వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. పెరుగు, డార్క్ చాక్లెట్, అరటి, అవకాడో పండ్లలోనూ ఇది పుష్కలంగా ఉంటుంది. 

పొటాషియం 
   మన శరీరంలో పేరుకుపోయిన అధిక సోడియంను పొటాషియం బయటకు పంపేస్తుంది. మెగ్నీషియంలానే ఇది కండరాల ఫైబర్‌ రిలాక్సేషన్‌కు తోడ్పడుతుంది. అరటి, ఆరెంజ్, రైజిన్స్, ప్రూన్స్ వంటి పండ్లతోపాటు ఆకుకూరలు, చిలగడ దంపలు, టమాటాలు, బ్రకోలి, పాలు, పెరుగు, చీజ్ చేపలు, నట్స్, సీడ్స్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. 

జింక్ రిచ్ ఫుడ్స్
   
 నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తికి జింక్ సాయపడుతుంది. ఇది రక్తనాళాలను విడదీస్తుంది. సిస్టోలిక్ రక్తపోటును తగ్గించడంలో ఇది సాయపడుతుంది. అంతేకాదు, ఇది యాంటీ ఆక్సిడెంట్ కూడా. మాంసం, పౌల్ట్రీ, సీఫుడ్, నట్స్, చిక్కుళ్లు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు వంటి వాటిలో జింక్ పుష్కలంగా ఉంటుంది. 

నైట్రేట్లు
   
నైట్రేట్లు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి సాయపడతాయి. రక్తనాళాల విస్తరణకు తోడ్పతాయి. బీట్‌రూట్‌లో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ కప్పు బీట్‌రూట్ రసాన్ని తీసుకోవడం వల్ల స్త్రీ పురుషుల్లో సిస్టోలిక్ ఒత్తిడి అదుపులోకి వస్తుంది. బచ్చలికూర, పాలకూర, ఇతర ఆకుకూరల్లో ఇవి కావాల్సినంతగా లభిస్తాయి. 

కాబట్టి పైన పేర్కొన్న ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడంతోపాటు గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడొచ్చు.

More Telugu News