Indian Army: ఆత్మహత్య చేసుకున్న ‘అగ్నివీర్’.. సైనిక లాంఛనాలు ఉండవని తేల్చేసిన ఆర్మీ

  • రాజౌరీ సెక్టార్‌లో సెంట్రీ డ్యూటీలో ఉండగా అమృత్‌పాల్ సింగ్ ఆత్మహత్య
  • ఆత్మహత్య చేసుకున్న వారికి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు ఉండవని సైన్యం స్పష్టీకరణ
  • 2001 నుంచి ఇప్పటి వరకు 100-140 మంది సైనికులు ఆత్మహత్య చేసుకున్నారన్న సైన్యం
Agniveer Amritpal Singh died by suicide no military honours as per rule says Army

సెంట్రీ విధుల్లో ఉండగా తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన అమృత్‌పాల్ సింగ్‌కు ఎలాంటి సైనిక గౌరవం లభించదని ఆర్మీ స్పష్టం చేసింది. అగ్నిపథ్ పథకం అమలుకు ముందు లేదంటే తర్వాత సైన్యంలో చేరారా? అన్న దాని ఆధారంగా సైనికుల మధ్య తేడా ఉండదని సైన్యం తేల్చి చెప్పింది. అగ్నివీర్ సైనికుడికి మిలటరీ గౌరవం ఇవ్వడం లేదంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించిన సైన్యం ఈ విషయాన్నిస్పష్టం చేసింది.

రాజౌరీ సెక్టార్‌లో సెంట్రీ డ్యూటీలో ఉండగా సింగ్ తుపాకితో కాల్చుకుని చనిపోయినట్టు వైట్ నైట్ కోర్ స్పష్టం చేసింది. సింగ్ మరణం దురదృష్టకరమని పేర్కొంది. ఆయన మరణానికి తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపింది. సింగ్ మృతి ఆయన కుటుంబానికి, భారత సైన్యానికి తీరని లోటని తెలిపింది. మెడికో లీగల్ ప్రొసీజర్ తర్వాత సింగ్ మృతదేహాన్ని ఎస్కార్ట్‌తోపాటు ఆయన స్వస్థలానికి పంపినట్టు పేర్కొంది.  

1967 ఆర్మీ ఆర్డర్ ప్రకారం ఇలాంటి కేసులు సైనిక అంత్యక్రియలకు అర్హం కావని స్పష్టం చేసింది. సైనికుల అంత్యక్రియల విషయంలో ఎలాంటి వివక్ష ఉండదని పేర్కొంది. 2001 నుంచి  ఇప్పటి వరకు 100-140 మంది సైనికులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆయా సందర్భాలలో సైనిక గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించలేదని వివరించింది.

More Telugu News