CM KCR: 51 మందికే బీ ఫామ్ లు.. బీఆర్ఎస్ అభ్యర్థుల్లో టెన్షన్

  • తొలి జాబితాలో మార్పులు చేస్తారని ప్రచారం
  • ఆందోళన చెందుతున్న బీ పామ్ అందని అభ్యర్థులు
  • నెగెటివ్ రిపోర్టుల నేపథ్యంలో చివరి నిమిషంలో పేర్ల మార్పు?
CM KCR Big Twist In B Forms In Telangana Bhavan

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సిట్టింగ్ లు అందరికీ టికెట్ ఇస్తామని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) చీఫ్ కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. అదేవిధంగా ఐదారుగురికి తప్ప మిగతా సిట్టింగ్ లు అందరికీ టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. ఆ పక్కన పెట్టిన వారిని కూడా విధిలేని పరిస్థితుల్లోనే తప్పించాల్సి వచ్చిందని ఆదివారం తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ అభ్యర్థులు, నియోజక వర్గ ఇంచార్జ్ ల సమావేశంలో చెప్పారు. అయితే, తొలి జాబితాలో పేరున్న అభ్యర్థులలో కొందరిని తప్పించే అవకాశం ఉందని తాజాగా ప్రచారం జరుగుతోంది. ఆదివారం కేవలం 51 మందికే కేసీఆర్ బీ ఫామ్స్ అందజేశారు.

మిగతా బీ ఫామ్స్ సిద్ధం కాలేదని ఆయన చెప్పడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో బీ ఫామ్ అందుకోని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తొలి జాబితా ప్రకటించి దాదాపు 50 రోజులు కావొస్తున్నా ఇప్పటికీ బీ ఫామ్స్ సిద్ధం కాలేదనడంపై పార్టీ వర్గాలు, రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేలపై నెగెటివ్ రిపోర్టుల కారణంగా కొంతమందిని చివరి నిమిషంలో పక్కన పెట్టే అవకాశం ఉందని, అందుకే బీ ఫామ్స్ ఆపేశారని ప్రచారం జరుగుతోంది. టికెట్ దక్కలేదనే అసంతృప్తితో నేతలు పార్టీ మారే అవకాశం ఉందని, వారికి ఆ అవకాశం ఇవ్వొద్దనే ఉద్దేశంతోనే కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


More Telugu News