Israel: కిడ్నాప్ అయితే నాకేంటి..? టైమ్ కు రెంట్ కట్టాల్సిందే!.. ఇజ్రాయెల్ ఓనర్ కర్కశత్వం

  • యువతి రూమ్మేట్ కు అల్టిమేటం జారీ చేసిన ఓనర్
  • సామాన్లు బయటపడేసి వేరేవారికి అద్దెకిస్తానని హెచ్చరిక
  • యువతి తండ్రికి మెసేజ్ చేసిన రూమ్మేట్.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తండ్రి
Kidnapped Israeli Womans Landlord Demands Her Rent

ఇజ్రాయెల్ లో హమాస్ మిలిటెంట్లు చేసిన ఆకృత్యాలు అన్నీ ఇన్నీ కావు.. పసి పిల్లలు, మహిళలు, వృద్ధులనే తేడా లేకుండా నరమేధం సృష్టించారు. యువతులు, మహిళలను ఎత్తుకెళ్లి బంధించారు. గాజా సరిహద్దుల్లో జరిగిన సూపర్ నోవా రేవ్ పార్టీలో సుమారు 250 మందికి పైగా పౌరులను చంపేశారు. పదుల సంఖ్యలో యువతులను ఎత్తుకెళ్లారు. ఇలా హమాస్ మిలిటెంట్లు బంధించిన యువతులలో ఇన్బార్ హైమన్ కూడా ఒకరు. అయితే, తాజాగా ఇన్బార్ ఉంటున్న ఇంటి ఓనర్ తనకు రావాల్సిన రెంట్ కోసం డిమాండ్ చేయడం విస్మయం కలిగిస్తోంది.

ఇన్బార్ ను మిలిటెంట్లు కిడ్నాప్ చేశారని ఆమె రూమ్మేట్ చెప్పినా సదరు ఓనర్ వినిపించుకోలేదట. ‘కిడ్నాప్ అయితే నాకేంటి.. అది నా సమస్య కాదు. టైమ్ కు రెంట్ కట్టకుంటే సామాన్లు బయటపడేసి వేరే వారికి అద్దెకు ఇచ్చుకుంటా’ అని తేల్చి చెప్పాడట. మరో రూమ్మేట్ ను వెతుక్కుంటావా లేక ఆమె పేరెంట్స్ తో మాట్లాడి నా రెంట్ చెల్లిస్తావా.. ఏం చేస్తావో నువ్వే నిర్ణయించుకోవాలని సూచించాడట. ఈ విషయాన్ని ఇన్బార్ రూమ్మేట్ ఆమె తండ్రికి తెలియజేశాడు. దీంతో ఆ ఓనర్ తో జరిపిన సంభాషణలకు సంబంధించిన మెసేజ్ లను ఇన్బార్ తండ్రి స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఓవైపు కూతురు మిలిటెంట్ల చెరలో ఉందని తాము బాధపడుతుంటే ఇంటి ఓనర్ కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. మిగతా ఓనర్లైనా కనీస మానవత్వం చూపాలని అందులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ కావడం, నెటిజన్లు తీవ్రంగా మండిపడడంతో ఇన్బార్ ఓనర్ స్పందించాడు. ఇన్బార్ అసలు రెంట్ బాకీ పడలేదని, అలాంటప్పుడు తాను రెంట్ ఎలా డిమాండ్ చేస్తానని ఎదురు ప్రశ్నించాడు. అందరితో పాటు తాను కూడా ఇన్బార్ సహా ఇతర బంధీలు అంతా క్షేమంగా రావాలనే కోరుకుంటున్నానని చెప్పాడు.

More Telugu News