World Cup: యుద్ధం ముగిసింది... భారత్, పాక్ కెప్టెన్లు ఏమన్నారంటే...!

  • వరల్డ్ కప్ మ్యాచ్ లో తలపడిన భారత్, పాకిస్థాన్
  • 7 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం
  • బౌలర్లదే తమ విజయంలో ప్రధాన పాత్ర అని వెల్లడించిన రోహిత్
  • ఉన్నట్టుండి కుప్పకూలామన్న బాబర్ అజామ్
What Rohit Sharma and Babar Azam said after world cup clash

గత కొన్ని వారాలుగా క్రికెట్ ప్రపంచంలో, అభిమానుల్లో నెలకొన్న మేనియా నేటితో ముగిసింది. ఇవాళ జరిగిన భారత్, పాకిస్థాన్ క్రికెట్ సమరం గురించి కొన్ని నెలల ముందు నుంచే చర్చలు, మాటల యుద్ధాలు జరిగాయి. ఇరు జట్ల అభిమానులు సోషల్ మీడియాలో కత్తులు దూశారు. అన్నింటికీ ఇవాళ్టితో తెరపడింది. అహ్మదాబాద్ లో పాకిస్థాన్ తో జరిగిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వన్డే వరల్డ్ కప్ పోటీల్లో భారత్ చేతిలో మరోమారు పాక్ కు భంగపాటు తప్పలేదు. 

నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరుజట్ల కెప్టెన్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. టీమిండియా సారథి రోహిత్ శర్మ స్పందిస్తూ... తమ విజయంలో బౌలర్లతో ప్రధాన పాత్ర అని కొనియాడాడు. వారే విజయానికి రంగం సిద్ధం చేశారని వెల్లడించాడు. 

"పాకిస్థాన్ వంటి జట్టును 191 పరుగులకే పరిమితం చేయడం మామూలు విషయం కాదు. వాస్తవానికి ఇది లో స్కోరింగ్ పిచ్ కూడా కాదు. దాన్నిబట్టే బౌలర్లు ఎంత శ్రమించారో అర్థమవుతుంది. ఓ దశలో పాక్ స్కోరు 280-290 వరకు వెళుతుందేమో అనిపించింది. కానీ, ఇవాళ బంతి పట్టినవాళ్లందరూ తమ వంతు కృషి చేయడంతో ఈ విజయం సాధ్యమైంది. ఇక నా విషయానికొస్తే నేను జట్టు కెప్టెన్ ని. జట్టులో నాది చాలా బాధ్యతాయుతమైన పాత్ర. జట్టులో ప్రతి ఆటగాడికి తన బాధ్యతలు, తాను ఏంచేయగలడు అన్నదానిపై స్పష్టత ఉంది. బాగా ఆడేలా ప్రోత్సహించడం కూడా నా బాధ్యతే" అని వివరించాడు. 

ఇక పాకిస్థాన్ సారథి బాబర్ అజామ్ మ్యాచ్ పై స్పందించాడు. "మేం ఆరంభంలో బాగానే ఆడాం. మంచి భాగస్వామ్యం నెలకొల్పాం. రిస్క్ జోలికి వెళ్లకుండా భాగస్వామ్యాలు నమోదు చేయాలన్నది మా ప్రణాళిక. కానీ ఉన్నట్టుండి కుప్పకూలాం. మా ఇన్నింగ్స్ ముగింపు ఏమంత గొప్పగా లేదు. ఈ పిచ్ పై 290 పరుగులు చేస్తే గెలుస్తామని భావించాం. కానీ, వరుసగా వికెట్లు అప్పగించి తగిన మూల్యం చెల్లించాం. ఈ మ్యాచ్ ఫలితం మాకేమంత శుభప్రదం కాదు. ఇక, కొత్త బంతితోనూ మేం అంచనాల మేరకు రాణించలేకపోయాం. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ అత్యద్భుతం. వికెట్లు పడగొట్టాలని ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు" అని వివరించారు.

More Telugu News