Team India: హిట్ మ్యాన్ కొడితే... మనవాళ్లు పాక్ ను కుమ్మేశారంతే...!

  • వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కు చుక్కలు చూపించిన టీమిండియా
  • అహ్మదాబాద్ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో గెలిచిన రోహిత్ సేన
  • 192 పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలో ఛేదించిన టీమిండియా
  • 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ
Team India beat Pakistan by 7 wickets

వన్డే వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్ చేతిలో ఓడిపోని రికార్డును భారత్ మరోసారి కాపాడుకుంది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా దాయాదుల సమరంలో 7 వికెట్ల తేడాతో ఘనంగా గెలిచింది. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగింది. 

టీమిండియా గెలుపుతీరాలకు చేరడం ఆలస్యం... మైదానంలో వందేమాతరం గీతం మార్మోగింది. భారత ఆటగాళ్ల ముఖాల్లో విజయగర్వం తొణికిసలాడగా, పాక్ ఆటగాళ్ల ముఖాల్లో తీవ్ర నిరుత్సాహం కనిపించింది. కాగా, ఈ వరల్డ్ కప్ లో ఇది భారత్ కు వరుసగా మూడో విజయం. 

నేటి మ్యాచ్ విషయానికొస్తే... ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి పాకిస్థాన్ కు బ్యాటింగ్ అప్పగించింది. అయితే, టాపార్డర్ ఓ మోస్తరుగా రాణించినప్పటికీ, మిడిల్ ఓవర్ల నుంచి పాక్ పతనం మొదలైంది. బ్యాట్స్ మెన్ క్రీజులో నిలదొక్కుకునే లోపే వికెట్లు ఎగిరిపోయాయి. భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్, పాండ్యా, కుల్దీప్, జడేజా తలా రెండు వికెట్లతో పాక్ పనిబట్టారు. టీమిండియా బౌలర్ల దాటికి పాక్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. ఎంతో సులువైన లక్ష్యాన్ని భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు ఛేదించింది. 

కెప్టెన్ రోహిత్ శర్మ తనకు మాత్రమే సాధ్యమైన పవర్ హిట్టింగ్ తో పరుగుల మోత మోగించడం భారత్ ఇన్నింగ్స్ లో హైలైట్. రోహిత్ కేవలం 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 86 పరుగులు చేసి జట్టు విజయానికి బాటలు పరిచాడు. గిల్ (16), కోహ్లీ (16) తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ జోడీ నిలకడగా ఆడి పాక్ కు మ్యాచ్ ను దూరం చేసింది. శ్రేయాస్ అయ్యర్ 62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేఎల్ రాహుల్ 19 (నాటౌట్) పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 2, హసన్ అలీ 1 వికెట్ తీశాడు. 

కాగా, వన్డే వరల్డ్ కప్ లలో పాకిస్థాన్ పై ఇది భారత్ కు 8వ విజయం. ఏ వరల్డ్ కప్ లో ఇరు జట్లు తలపడినా భారత్ దే పైచేయిగా వస్తోంది. ఆ ఆనవాయతీని రోహిత్ సేన కూడా కొనసాగించింది. ఇక, ఈ వరల్డ్ కప్ లో భారత్ తన తదుపరి మ్యాచ్ ను అక్టోబరు 19న బంగ్లాదేశ్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ కు పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా నిలవనుంది.

More Telugu News