Nara Brahmani: చంద్రబాబుకు మద్దతుగా కదం తొక్కిన ఐటీ నిపుణులు... వారికి అసౌకర్యం కలిగించొద్దని పోలీసులను కోరిన నారా బ్రాహ్మణి

  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • హైదరాబాదులో లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ కార్యక్రమం
  • భారీగా తరలివచ్చిన ఐటీ నిపుణులు
  • పలు చోట్ల నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు
Nara Brahmani urges police

స్కిల్ కేసులో అరెస్టయిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు మద్దతుగా ఇవాళ హైదరాబాదులో ఐటీ నిపుణులు 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్' కార్యక్రమంలో భారీగా పాల్గొన్నారు. నల్ల టీషర్టులు ధరించి మియాపూర్ నుంచి ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ల మధ్య ప్రయాణించారు. 

అయితే, చంద్రబాబుకు సంఘీభావంగా కదలి వచ్చిన చాలామందిని పోలీసులు అడ్డుకున్నారు. పలు చోట్ల అరెస్టులు కూడా జరిగినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి స్పందించారు. 

"చంద్రబాబు ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు, అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారు. చంద్రబాబు దార్శనిక కార్యక్రమాలు ఎంతోమంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపాయి... ఇవాళ వారందరూ వచ్చి బలంగా నిలబడి చంద్రబాబుకు సంఘీభావం పలుకుతుండడం చూస్తుంటే స్ఫూర్తిదాయకంగా ఉంది. అలాంటి వాళ్లందరూ నేడు హైదరాబాదులో ఒక్కతాటిపైకి వచ్చారు. లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ పేరిట శాంతియుత ప్రదర్శన చేపట్టారు. చంద్రబాబు మనసులోంచి పుట్టిన అనేక ఆలోచనల్లో మెట్రో కూడా ఒకటి. ఇవాళ ఆ మెట్రో  ద్వారానే వారంతా చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సందర్భంగా నేను పోలీసులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే... ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాదిగా వచ్చిన ప్రొఫెషనల్స్ కు, మహిళలకు, చిన్నారులకు దయచేసి ఎలాంటి అసౌకర్యం కలిగించకండి" అంటూ వివరించారు.

More Telugu News