DIG Ravi Kiran: చంద్రబాబుకు చల్లని వాతావరణం కల్పించడంపై కోర్టు నిర్ణయిస్తుంది: డీఐజీ రవికిరణ్

  • జైల్లో చంద్రబాబుకు మరోసారి వైద్యపరీక్షలు
  • చంద్రబాబును పరిశీలించిన ప్రభుత్వ వైద్యుల బృందం
  • డాక్టర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించిన డీఐజీ రవికిరణ్
DIG Ravi Kiran press meet over Chandranbabu health concerns

జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ఇవాళ చంద్రబాబుకు వైద్య పరీక్షల అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు మెడికల్ నివేదిక బయటికి వచ్చిందని చెబుతున్నారు... అందులోని కొన్ని అంశాలను నల్ల రంగులో హైలైట్ చేయడం జరిగింది... అవన్నీ వ్యక్తిగత అంశాలు అని వెల్లడించారు. 

చంద్రబాబుకు చల్లని వాతావరణం కావాలని వైద్యులు సిఫారసు చేసిన మాట వాస్తవమేనని, ఆ అంశాన్ని పై అధికారులకు, కోర్టుకు తెలియజేస్తామని స్పష్టం చేశారు. అక్కడ్నించి వచ్చే ఆదేశాలను తాము పాటిస్తామని వివరించారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఈ సాయంత్రం హెల్త్ బులెటిన్ ఇస్తానని డీఐజీ రవికిరణ్ తెలిపారు. 

"చంద్రబాబు సర్ తనకు ఒంటిపై దద్దుర్లు (ర్యాష్) వస్తున్నట్టు జైలు సిబ్బందికి చెప్పారు. దాంతో, మా వద్ద ఉన్న చర్మవ్యాధుల స్పెషలిస్ట్ ను పంపించాం. అయితే, మరో డాక్టర్ అభిప్రాయం కూడా తీసుకుంటే మంచిదని భావించి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి వారికి సమాచారం అందించాం. ప్రభుత్వాసుపత్రి నుంచి ఒక చర్మవ్యాధుల స్పెషలిస్ట్ తో కూడిన వైద్యబృందాన్ని పిలిపించి చంద్రబాబుకు చెకప్ చేయించాం. ఆ వైద్యులు ఒక నివేదిక ఇచ్చారు. కానీ, బయట రకరకాల అంశాలపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి కాబట్టి మళ్లీ ఒక వైద్య బృందాన్ని పంపించాం. 

మేం కోర్టుకు ఒక నివేదిక ఇచ్చేటప్పుడు సమగ్రంగా ఉండేలా ఇవ్వాల్సి ఉంటుంది. తాజా నివేదికను ఇవాళ కోర్టుకు ఇస్తున్నాం. చంద్రబాబు ఆరోగ్య సమస్య విషయం మా దృష్టికి వచ్చింది అక్టోబరు 12న. నిన్న రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి డాక్టర్ల బృందం వచ్చింది. వారు ఇచ్చిన నివేదికను మేం ఇప్పటికే కోర్టుకు పంపించాం. ఇవాళ మరో వైద్య బృందం వచ్చింది... వారు ఇచ్చే నివేదికను కూడా కోర్టుకు పంపిస్తాం. 

చంద్రబాబేమీ చిన్నాచితకా ఖైదీ కాదు. ఒక మామూలు ఖైదీకి ఏమైనా జరిగితేనే మానవ హక్కుల కమిషన్ వాళ్లు వెంటనే స్పందిస్తారు. మా విధుల పట్ల మేం బాధ్యతగానే ఉంటాం. చంద్రబాబు వంటి హై ప్రొఫైల్ ఖైదీ పట్ల ఎందుకు అజాగ్రత్తగా ఉంటాం? చంద్రబాబు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నామన్న ఆలోచనే వద్దు" అని వివరించారు.

ఇక, ములాఖత్ సందర్భంగా లోకేశ్ తో తాను దురుసుగా ప్రవర్తించినట్టు వస్తున్న వార్తలను డీఐజీ రవికిరణ్ తోసిపుచ్చారు. ములాఖత్ టైమ్ అయిపోయిందని చెప్పామని, ములాఖత్ ముగియడంతో వైద్యుల బృందం వస్తోందని చెప్పామని వివరించారు. 

"ఎవరిని ఎంత గౌరవంగా చూడాలనేది మాకు ప్రోటోకాల్ ఉంటుంది. మామూలు ప్రజలతోనే మేం దురుసుగా ప్రవర్తించం. అలాంటిది హై ప్రొఫైల్ వ్యక్తులతో ఎందుకు అలా ప్రవర్తిస్తాం చెప్పండి. ఆ సమయంలో అక్కడ నేను గానీ, జైలు సూపరింటిండెంట్  గానీ ఉన్నా... "సర్... ములాఖత్ కు 45 నిమిషాల టైమ్ అయిపోయింది" అని గుర్తు చేస్తాం. అది మా బాధ్యత. 

జైల్లోకి వచ్చాక ప్రతి ఒక్కరూ ఖైదీలే అవుతారు. కోర్టు శిక్ష విధించినా, రిమాండ్ పై వచ్చినా... ఖైదీలుగానే పరిగణిస్తాం. చంద్రబాబు ఆరోగ్య నివేదికలో మేం దాచిపెట్టేది ఏమీ లేదు. డాక్టర్లు ఏ నివేదిక ఇచ్చారో దాన్నే కోర్టుకు పంపించాం. చంద్రబాబుకు చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్లు సిఫారసు చేసిన అంశాన్ని నిన్ననే నేను ప్రస్తావించాను. జైలులో ఏసీలు, కూలర్ల ఏర్పాటుపై జైలు మాన్యువల్ లో ఎక్కడా పేర్కొనలేదు. దీనిపై కోర్టు నిర్ణయమే శిరోధార్యం. ప్రత్యేక కేసుగా భావించి చల్లని వాతావరణం అందించాలని కోర్టు ఆదేశిస్తే ఆ మేరకు చర్యలు తీసుకుంటాం" అని డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు.

More Telugu News