Revanth Reddy: రేవంత్‌పై రామేశ్వరరావు దాఖలు చేసిన పరువునష్టం దావా మళ్లీ విచారణ.. హైకోర్టు ఆదేశం

  • నిబంధనలకు లోబడి పరిగణనలోకి తీసుకోవాలని కిందిస్థాయి కోర్టుకు ఆదేశం
  • తాత్కాలిక నిలిపివేయాలంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేత
  • 2018లో రేవంత్ ఆరోపణలపై మళ్లీ ప్రారంభం కానున్న విచారణ
HC orders to take congnigence in defamation case on Revanth Reddy

డీఎల్ఎఫ్ భూముల వ్యవహారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 2014లో చేసిన ఆరోపణలపై మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావు దాఖలు చేసిన పరువునష్టం పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిబంధనలకు అనుగుణంగా ఈ పిటిషన్‌ను పరిగణనలోకి (కాగ్నిజెన్స్) తీసుకోవాలని కిందిస్థాయి కోర్టును హైకోర్టు ఆదేశించింది. కాగా అవాస్తవ విమర్శల కారణంగా తన పరువుకు భంగం వాటిల్లిందంటూ రామేశ్వరరావు రూ.90 కోట్ల మేర పరువునష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కిందిస్థాయి కోర్టు రేవంత్ రెడ్డికి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ రేవంత్ రెడ్డి 2018లో హైకోర్ట్‌ను ఆశ్రయించారు. దీంతో కిందిస్థాయి కోర్టు విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీచేసింది. తాజాగా తిరిగి నిబంధనలకు లోబడి రామేశ్వరరావు పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. 


కాగా.. రేవంత్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టులో కీలక వాదనలు జరిగాయి. రామేశ్వరరావు పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోవడానికి కారణాలు చెప్పాలని రేవంత్ రెడ్డి లాయర్లు వాదించారు. లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేయకుండానే మేజిస్ట్రేట్ పరిగణలోకి తీసుకోవడం చెల్లుబాటుకాదని వాదనలు వినిపించారు. ఇందుకు సంబంధించి దేశ సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలు ఉన్నాయని ప్రస్తావించారు. అయితే కిందిస్థాయి కోర్టు పరిగణనలోకి తీసుకోవడం చట్టబద్ధమేనని రామేశ్వరరావు తరపు లాయర్లు వాదించారు. చివరిగా ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. పరిగణనలోకి తీసుకుంటున్నట్టు నోటీసులు ఉండాలని తెలిపింది. గత ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని, మళ్లీ ప్రొసీడింగ్స్ నిర్వహించేందుకు కేసును దిగువస్థాయి కోర్టుకు అప్పగిస్తున్నట్టు ఆదేశాలిచ్చింది. దీంతో పరువునష్టం దావాపై విచారణ మళ్లీ మొదలుకానుంది.


More Telugu News