K Kavitha: అది మీకు మాత్రమే సాధ్యం: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్

Kavitha counter to Revanth Reddy
  • ప్రవళిక ఆత్మహత్య విచారకరమని, ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని కవిత ఆవేదన
  • బతుకమ్మ పండుగను జరుపుకోవడంతో పాటు బాధను కూడా పంచుకుంటామని కౌంటర్
  • ఆడబిడ్డ ఆత్మహత్యపై రాజకీయం చేయడమే మీ విధానమా? అని ప్రశ్న
గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ ఆత్మహత్య విచారకరమన్నారు. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రావొద్దన్నారు. ప్రవళిక ఆత్మహత్యపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ పైనా కవిత స్పందించారు. తాము బతుకమ్మ పండుగను జరుపుకోవడంతో పాటు బాధను కూడా పంచుకుంటామన్నారు. తెలంగాణ సంప్రదాయ పండుగను కించపరచడం కాంగ్రెస్‌కు మాత్రమే సాధ్యమని విమర్శించారు. ఆడబిడ్డ ఆత్మహత్యపై రాజకీయం చేయడమే మీ విధానామా? అని ప్రశ్నించారు.

అసలు నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ అన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేసిన మాట వాస్తవం కాదా? అన్నారు. కాంగ్రెస్ కుట్రల్ని చేధించి లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది కేసీఆర్ అని అన్నారు. గ్రూప్-2ను వాయిదా వేయాలని శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేశారని, రేవంత్ రెడ్డి కూడా వాయిదా వేయాలని ట్వీట్ చేశారన్నారు.

శవాలమీద పేలాలు ఏరుకోవడం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లుగా కాంగ్రెస్ వ్యవహారం ఉందన్నారు. ఆత్మహత్యపై రేవంత్ రెడ్డి ఆవేదన బూటకమని, కాంగ్రెస్ ఆందోళన నాటకమన్నారు. కాగా, అంతకుముందు రేవంత్ రెడ్డి... బతుకమ్మ సంబరాల గురించి రంగురంగుల వీడియోలు పెట్టే కవితకు ప్రవళిక ఆత్మఘోష కనిపించడం లేదా? మీ దృష్టిలో ఆడబిడ్డ హక్కులు రాజకీయ అంగడి సరుకేనా? అని ప్రశ్నించారు. దీనిపై కవిత పైవిధంగా స్పందించారు.
K Kavitha
Revanth Reddy
Congress
BRS

More Telugu News