Russia: టర్కీలో రష్యా దౌత్యవేత్త మృతి.. పుతిన్‌పై సందేహాలు

Police probe mystery of top Russian diplomat found dead at hotel in Turkey
  • కలకలం రేపుతున్న రష్యా ప్రముఖుల మరణాలు
  • ఇటీవల టర్కీలో రష్యా దౌత్యవేత్త నికొలాయ్ కోబ్రినెట్స్ అనుమానాస్పద మృతి
  • హోటల్‌‌లో విగతజీవిగా పడి ఉన్న నికోలాయ్‌ను గుర్తించిన సహోద్యోగులు
  • గుండెపోటుతో మరణించినట్టు వార్తలు, ఘటనపై టర్కీ పోలీసుల దర్యాప్తు 
  • తన ప్రత్యర్థులను పుతిన్ అడ్డుతొలగిస్తున్నారని వెల్లువెత్తుతున్న ఆరోపణలు
టర్కీలో రష్యా దౌత్యవేత్త నికొలాయ్ కోబ్రినెట్స్ అనుమానాస్పద మరణంపై అక్కడి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆయన గుండెపోటుతో మరణించి ఉంటారని తొలుత వార్తలు వెలువడినా ఘటనపై లోతైన దర్యాప్తు కోసం టర్కీ అధికారులు రంగంలోకి దిగారు. టర్కీలో జరుగుతున్న వివిధ దేశాల రాయబారుల సమావేశంలో పాల్గొనేందుకు నికొలాయ్ కోబ్రినెట్స్ టర్కీ వెళ్లారు. ఇస్తాంబుల్‌లోని ఓ హాటల్‌లో బస చేశారు. అయితే, ఆయన ఓ మీటింగ్‌కు హాజరుకాని విషయాన్ని గుర్తించిన సహోద్యోగులు ఆయన హోటల్‌కు వెళ్లిచూడగా విగతజీవిగా కనిపించారు. ఈ క్రమంలో, నికొలాయ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హోటల్‌, పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

ఇటీవల కాలంలో పలువురు రష్యా ప్రముఖులు, సంపన్నుల మరణాలు ఆ దేశాన్ని కుదిపేస్తున్నాయి. ఉక్రెయిన్‌‌తో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచీ దాదాపు 40 మంది ప్రముఖులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. కొందరు భవంతులపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా మరికొందరు ప్రమాదవశాత్తూ కిటికీల నుంచి జారిపడి మృతి చెందారు. కొంతకాలం క్రితం స్పుత్నిక్-వీ టీకా కనిపెట్టిన శాస్త్రవేత్తను ఎవరో బెల్టుతో గొంతునులిమి చంపేశారు. రష్యా ప్రైవేటు ఆర్మీ వాగ్నర్ గ్రూప్‌ అధినేత ప్రిగోజిన్‌ కూడా ఇలాగే అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. పుతిన్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసి ఆ తరువాత రాజీ పడ్డ ఆయన విమానం ప్రమాదంలో మరణించారు. 

ఈ నేపథ్యంలో ప్రస్తుతం రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యర్థులను లొంగదీసుకునేందుకు పుతిన్ ఓ మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారని ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనల వెనక ఆయన హస్తం ఉందని మండిపడుతున్నారు.
Russia
Turkey

More Telugu News