Gaza Tunnels: గాజాపై భూతల దాడులు.. ఇజ్రాయెల్‌‌కు అతిపెద్ద సవాలు ఇదే!

  • గాజాతో పాటూ ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత భూగర్భ సొరంగాల నెట్వర్క్
  • భూతల దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్‌కు పెను సవాలుగా మారిన వైనం
  • 500 కిలోమీటర్ల సొరంగాలు ఉన్నాయని అంచనా
  • హమాస్ కీలక నేతలూ సొరంగాల్లోనే!
 Israels Tall Challenge In Ground Offensive Plan is gaza tunnels

గాజాలో దాక్కున్న హమాస్ ఉగ్రవాదులపై ఇప్పటివరకూ మిసైళ్ల దాడులకే పరిమితమైన ఇజ్రాయెల్ ఇక భూతల దాడులకూ సిద్ధమవుతోంది. నేరుగా ఆర్మీని గాజాలోకి పంపించి ఉగ్రమూకలను తుదముట్టించాలని నిర్ణయించింది. అయితే, ఇది అనుకున్నంత సులభం కాదని పరిశీలకులు చెబుతున్నారు. గాజాలో వందల కిలోమీటర్ల మేర విస్తరించిన సొరంగాల్లో ఉన్న ఉగ్రవాదులను మట్టుపెట్టడం ఇజ్రాయెల్‌కు పెను సవాలేనని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సొరంగాలపై దాడులు కూడా మొదలుపెట్టినట్టు పేర్కొంది. 

ఏమిటీ సొరంగాలు.. !
గాజా ప్రాంతం హమాస్ ఆధీనంలోకి రాకమునుపు ఈ సొరంగాలను ఇజ్రాయెల్, ఈజిప్ట్‌లోకి స్మగ్లింగ్ కోసం వినియోగించేవారట. ఇక 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ సేనలు వెనుదిరిగాయి. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో హమాస్ విజయం సాధించింది. అనంతరం, ఈజిప్ట్, ఇజ్రాయెల్‌లు సొరంగాల వినియోగంపై కఠిన ఆంక్షలు విధించాయి. కానీ ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతలు పెరిగేకొద్దీ హమాస్, దాడుల కోసం వీటిని వినియోగించడం ప్రారంభించింది. ఇజ్రాయెల్ భూభాగంలోకి కూడా వీటిని విస్తరించింది.
ప్రస్తుత స్థితి ఇదీ.. 
ప్రస్తుతం గాజా భూభాగంతో పాటూ ఇజ్రాయెల్ సరిహద్దులో ఈ సొరంగాలు వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఒకానొక అంచనా ప్రకారం వీటి మొత్తం పొడవు 500 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. తాము 100 కిలోమీటర్ల మేర సొరంగాలను ధ్వంసం చేశామని గతంలో ఇజ్రాయెల్ పేర్కొనగా, ఆ మొత్తం ఐదు శాతానికి మించదని హమాస్ ప్రకటించింది. దీన్నిబట్టి సొరంగాల నెట్వర్క్ ఎంతటి విస్తృతమైనదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉగ్రవాదులు ఈ సొరంగాలను సమాచారం, ఆయుధ సరఫరా, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా మార్చుకున్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. అంతేకాకుండా, హమాస్ కీలక నేతలు వీటిల్లో దాక్కున్నట్టు చెబుతున్నారు.    

అకస్మిక దాడుల్లో కీలక పాత్ర..
కాగా, గత శనివారం హమాస్ ప్రారంభించిన ఆకస్మిక దాడుల్లో ఈ సొరంగాలు కీలక పాత్ర పోషించాయి. గాజా సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థలను తప్పించుకుని ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు ఈ సొరంగాలను విస్తృతంగా వినియోగించారు.

More Telugu News