Dil Raju: దిల్ రాజు అల్లుడి లగ్జరీ కారు చోరీ..గంటపాటు పోలీసులకు టెన్షన్!

  • శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్ వద్ద నిలిపిన పోర్షే కారు చోరీ
  • పోలీసులకు దిల్ రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి ఫిర్యాదు
  • పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీ పరిశీలన
  • కారును కేబీఆర్ పార్క్ వద్ద స్వాధీనంలోకి తీసుకున్న వైనం
  • నిందితుడికి మతిస్థిమితం లేదని అతడి కుటుంబసభ్యులు వెల్లడి
Dilraju son in laws stolen porsche car found in one hour by jubilee hills police

ప్రముఖ నిర్మాత దిల్ రాజు అల్లుడి లగ్జరీ కారు చోరీ కావడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ పోలీసులు సుమారు గంట పాటు శ్రమించి కారు ఆచూకీ కనుగొన్నారు. చోరీ చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేదని అతడి కుటుంబసభ్యులు తెలిపారు. దిల్‌రాజు అల్లుడు అర్చిత్ రెడ్డి శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని దసపల్లా హోటల్‌కు రూ.1.7 కోట్ల ఖరీదైన తన పోర్షే కారులో వెళ్లారు. కారును హోటల్ వద్దే నిలిపి లోపలికెళ్లిన ఆయన 40 నిమిషాల తరువాత బయటకు వచ్చేసరికి కారు అదృశ్యమైంది. దీంతో, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన డీఐ వీరశేఖర్, డీఎస్సై రాజశేఖర్..సిబ్బందిని రంగంలోకి దింపి సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో పోర్షే కారు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద సిగ్నల్ జంప్ చేసినట్టు గుర్తించారు. దీంతో, కేబీఆర్ పార్క్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులను వారు ఈ విషయమై అప్రమత్తం చేశారు. అక్కడి పోలీసులు కారును నిలువరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

నిందితుడేమో తాను ఆకాశ్ అంబానీ వ్యక్తిగత సహాయకుడినని, కేటీఆర్ కారు తీసుకెళ్లాలని సూచించారని చెప్పాడు. తాను, తన సహాయకుడు హృతిక్ రోషన్ కలిసి కారులో ఆకాశ్ అంబానీని కలవడానికి వెళ్లాల్సి ఉందని చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. ఈ క్రమంలో నిందితుడి కుటుంబసభ్యులకు ఫోన్ చేయగా వారు అతడికి మతిస్థిమితం లేదని, బ్రైట్ లైఫ్ ఫౌండేషన్‌లో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. నిందితుడిని మన్సూరాబాద్ ప్రాంతానికి చెందిన మల్లెల సాయికిరణ్‌గా పోలీసులు గుర్తించారు. 


More Telugu News