Virat Kohli: పాజీ.. మీ కోరిక నెరవేరుస్తా.. ఉసేన్‌బోల్ట్‌కు మాటిచ్చిన విరాట్ కోహ్లీ

 Virat Kohli makes a promise to Usain Bolt ahead of Pak match
  • ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కోహ్లీ డైవ్‌ను ప్రశంసించిన ఉసేన్‌బోల్ట్
  • పాక్‌తో మ్యాచ్‌ను లైవ్‌లో చూస్తానన్న జమైకన్  స్ప్రింటర్
  • అయితే 100 మీటర్ల స్ప్రింట్స్‌తో రెడీగా ఉండాలన్న విరాట్
  • నేడు భారత్-పాక్ మధ్య మ్యాచ్
ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య నేడు అహ్మదాబాద్‌లో జరగనున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మరోమారు చెలరేగిపోవాలని లెజండరీ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ కోరుకున్నాడు. ఈ మేరకు ఎక్స్ ద్వారా విరాట్‌పై ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియాతో ప్రారంభ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డైవ్‌ను గుర్తు చేస్తూ.. ‘‘మొన్నటి మ్యాచ్‌లో మీ డైవ్‌ను చూశాను. పిచ్‌పై మీరు వేగంగా కదిలితే.. నేను గాల్లో వేగంగా కదులుతాను. మీ తర్వాతి మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షిస్తాను’’ అని ఎక్స్ చేశాడు.

బోల్ట్ ఎక్స్‌పై స్పందించిన కోహ్లీ.. నువ్వు కోరుకున్నట్టుగా ఆడతానని రిప్లై ఇచ్చాడు. ‘‘ఉసేన్ పాజీ.. మీరు కనుక మ్యాచ్ వీక్షిస్తే.. కొన్ని అదనపు 100 మీటర్ల స్ప్రింట్స్‌తో రెడీ అవండి’ అని పేర్కొన్నాడు. బోల్ట్‌ను ‘పాజీ’ అని సంబోధిస్తూ అతడిపై తనకున్న అభిమానాన్ని, గౌరవాన్ని చాటుకున్నాడు.  

పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే చెడుగుడు ఆడే కోహ్లీ ఈ మ్యాచ్‌లో చిచ్చరపిడుగల్లే చెలరేగిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాక్ జట్లు నిరుడు మెల్‌బోర్న్‌లో తలపడినప్పుడు కోహ్లీ రెచ్చిపోయాడు. 53 బంతుల్లోనే 82 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివరి మూడు ఓవర్లలో విజయానికి 48 పరుగులు అవసరమైన వేళ కోహ్లీ ఆడిన తీరుకు క్రికెట్ ప్రపంచం ఉర్రూతలూగింది. 

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌లో 3 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 64.33 సగటుతో 193 పరుగులు చేశాడు. 2015 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై విరాట్ సెంచరీ బాదాడు. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై 7-0తో ఉన్న విజయాల రికార్డును కొనసాగించాలని భారత్ పట్టుదలగా ఉంది.
Virat Kohli
Team India
Pakistan
Usain Bolt
Usain Paaji

More Telugu News