Chandrababu: చంద్రబాబు ఆరోగ్యాన్ని చూసుకోవడానికి ముగ్గురు వైద్యులు అందుబాటులో వున్నారు: జైలు అధికారుల వివరణ

Jail officials press meet about chandrababu health
  • చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదన్న అధికారులు
  • భద్రత కోసం అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడి
  • తప్పుడు ప్రచారం చేసేవారికి అధికారుల హెచ్చరిక
  • ఆ వీడియోపై దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపిన జైలు అధికారులు
రాజమహేంద్రవరం జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని జైలు అధికారులు స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారు శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ అధినేత కోసం స్నేహ బ్యారెక్‌ను కేటాయించామని, ఆయన బయటకు వచ్చేటప్పుడు ఏ ఖైదీ కూడా ఉండరన్నారు. ఆయన భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

చంద్రబాబు ఆరోగ్యాన్ని చూసుకోవడానికి నిత్యం ముగ్గురు వైద్యులు అందుబాటులో ఉంటున్నారని, రోజుకు మూడుసార్లు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు జైలుకు వచ్చినప్పుడు 66 కిలోలు ఉన్నారని, ఇప్పుడు 67 కిలోలు ఉన్నారన్నారు. ఆయన ఒంటిపై దద్దుర్లు ఎక్కువగా ఉండటంతో జీజీహెచ్ డాక్టర్‌తో జైల్లోనే వైద్యం చేయించామన్నారు.

చంద్రబాబు ఎప్పుడూ వాడే మందులే వాడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు ఒక రిమాండ్ ఖైదీ మాత్రమేనన్నారు. హైప్రొఫైల్ ఖైదీకి ఇచ్చే అన్ని సౌకర్యాలు ఇస్తున్నట్లు చెప్పారు. ఆయన ప్రతి కదలిక సీసీ టీవీలో రికార్డ్ అవుతుందన్నారు. ఆయన జైలులోకి వెళ్లినప్పుడు బయటకు వచ్చిన వీడియోపై తాము దర్యాఫ్తు చేస్తున్నామన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది సరికాదన్నారు. తప్పుడు ప్రచారం చేసే వారిని తాము హెచ్చరిస్తున్నామన్నారు. లోకేశ్ ట్వీట్ అవాస్తవమన్నారు.

చంద్రబాబుకు దోమతెర ఇచ్చామన్నారు. కానీ జైలు నిబంధనల ప్రకారం ఏసీ, కూలర్ ఇవ్వలేమని చెప్పారు. కోర్టు నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం తాము నడుచుకుంటామన్నారు. తమపై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. చంద్రబాబుకు భద్రతా లోపాలు ఉన్నాయనే వార్తలను నమ్మవద్దని కోరారు.
Chandrababu
Police
Nara Lokesh

More Telugu News